ఐటి ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ టాప్‌

హైదరాబాద్‌ : ఐటి ఉద్యోగాల కల్పనలో దేశంలో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శనివారం కెఎల్‌ యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్‌లో ఆపిల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కెఎల్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్‌ నెల 15 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు, మెరిట్‌ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్‌ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం హరీష్‌ రావు మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఐటి ఉద్యోగాలను అందించామన్నారు. పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాట్లకు కావాల్సిన అన్ని రకాల మౌళిక వసతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తద్వారా హైదరాబాద్‌ నగరం అనేక రంగాల్లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కెఎల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సెలర్‌ డాక్టర్‌ పార్ధసారధి వర్మ, బోరంపేట క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కోటేశ్వరరావు, అజీజ్‌ నగర్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణ, యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.