శాంతి వాక్యమొకటి నాటుతున్నాను

రేపటి ఉదయాల్లోని తాజాదనమంతా
పొడిపొడిగా రాలిపోతుంది
పాలుతాగుతున్న పిట్టలు
ఇంకో ఉదయంలోకి కళ్ళు తెరవకుండానే
శవాల గుట్టలుగా పేరుకుపోతున్నాయి

విడగొట్టబడ్డ మట్టికణాలు
బాంబుల తుఫాను మధ్య చిక్కుకొని
ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి
చిటికెడు శాంతివాసనగల్ల
మనిషైవడైనా కనిపించడా అని
మబ్బుతెర వెనుక నుండి నెలవంక వేచి చూస్తుంది

సంవత్సరాల వెనక్కి పాకులాడటాలు
పాత ఆలోచనల తుండు గుడ్డల తలకట్టులు
వలస జాతుల ఆమోద పత్రాల
సంఘర్షణల అంతర్యుద్దమిది

నొక్కిపెట్ట బడ్డ సన్నని గొంతుల మూలుగులు
ఆకాశానికి ఎగిసిపడ్డ ఆక్రందనల ఆర్తనాదాలు
కాలపుపుటలకు ఎక్కిళ్లుపట్టి
మిణుగురులను కాంక్షిస్తున్న
ఒకానొక సందర్భం

చర్మం మీది గుర్తులు బీటలు వారిన అద్దం ముక్కలై
కళ్ళను గుచ్చుకుంటున్నాయి
శాంతిని కోరుతున్న న్యాయగంట
గాయాల సంద్రాన్ని తొడుక్కుని
లేతపచ్చివాసనతో గుబులుగా ఉంది

ఆధిపత్యపు కడ్డీలకట్టకు విద్వేషాలరంగు పులుముకున్న
ఉద్వేగ బాధితులకు
శాంతినిప్పు ఇంకెప్పుడు అంటుకుంటదో

ప్రపంచమంతా ఏకమయి
ఇసుకతిన్నెల గుండెలపై ప్రశాంతంగా నిద్రిస్తూ
తెల్లనిపావురాలుగా మారి తత్త్వగీతాలను పాడుకునే రోజు
కలలోనైనా వస్తుందో లేదో

నేనయితే శాంతివాక్యమొకటి నాటుతున్నాను
ఏరోజుకయినా అందరి గుండెల్లో విచ్చుకునే
ఆలోచనాపువ్వయి పూయకపోతుందా అని
– డా. తండ హరీష్‌ గౌడ్‌, 8978439551