నిలిచాను….గెలుస్తాను

– పాండురంగపురాన్ని అభివృద్ధి చేశా
– రూ.12 కోట్లతో బ్రిడ్జిని నిర్మించి కష్టాలు తీర్చాను
– ప్రతి ఒక్కరు నా హృదయంలో ఉన్నారు
– న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్‌ రావాలి
– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ఈ వయసులో ఇష్టం లేకున్నా ఈసారి నువ్వే నిలబడాలంటూ కేసీఆర్‌ చెప్పడం వల్ల ఎన్నికల బరిలో నిలిచానని, గెలిచేది కూడా తానేనని నా నియోజకవర్గ ప్రజలు అండగా ఉండగా నాకెందుకు భయం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజక వర్గం పాల్వంచ మండలంలోని పాండురంగాపురం, ఎస్సీ కాలనీ, తండా, ఇల్లందులపాడు తండా, తవిసెల గూడెం, పాత సూరారం, సూరారంలలో విస్తృతంగా పర్యటించిన వనమా ఓటర్లను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. తొలుత పాండురంగాపురం గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని సాగించారు. ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకు వెళ్లిన వనమాకు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఎదురెళ్లి హారతులు ఇచ్చి పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అడుగడుగునా వనమాకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు పాండురంగపురం, చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని 1989లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గ్రామాలు అభివవృద్ధికి నోచుకున్నాయని అన్నారు. గతంలో రోడ్లు లేక కిన్నెరసాని వాగు పొంగి పొర్లు తే రాకపోకలతో ఈ గ్రామాల ప్రజలు నరకం అనుభవించే వారిని ప్రజల కోరిక మేరకు రు.12 కోట్లతో బ్రిడ్జిని నిర్మించి ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చానన్నారు. చిన్న వ్యాధి వచ్చిన పాల్వంచ కొత్తగూడంలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి లేకుండా గ్రామంలోనే ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పూరి గుడిసెలుగా ఉన్న గ్రామాలకు పక్క ఇండ్లు మంజూరు చేయించి అభివృద్ధి చేశానన్నారు. అంతేకాకుండా రోడ్లు, డ్రైన్లు నిర్మించి కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు దీటుగా పాండురంగపురంతో పాటు ఇతర గ్రామాలను అభివృద్ధి చేశానన్నారు. రానున్న రోజుల్లో ఈ గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన తనను ఈ నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు. తను గెలిచిన వెంటనే ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలు గెలిస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ పథకాలు ప్రజలకు దూరం అవుతాయని ఆ విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.