నేను కాంగ్రెస్‌లోనే ఉంటా…

– జూపల్లి, దామోదర్‌రెడ్డి ఇప్పుడొచ్చి టికెటంటే ఎలా : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నేను పార్టీ మారుతాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటానని తెలిపారు. ఐదేండ్లుగా నాగర్‌కర్నూల్‌లో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నట్టు చెప్పారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర్‌రెడ్డి ఇప్పుడొచ్చి టికెట్‌ నాదేనంటున్నారని ఎద్దేవా చేశారు. దామోదర్‌రెడ్డి ఇంకా కాంగ్రెస్‌ పార్టీలోనే అధికారికంగా చేరనేలేదని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళరని గ్యారంటీ ఏంట ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అందరూ టికెట్‌ కోసం దరఖాస్తు పెడిదే, నేను కూడా దరఖాస్తు చేస్తా.’ అని చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల కోట్ల కుంభకోణం జరిగింది. తనకు, గాంధీభవన్‌కు దూరం పెరగలేదు. అవినీతిపై సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లదే బాధ్యత. ఆ ప్రాజెక్టు అవినీతిపై తాడో, పేడో పేల్చుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీలకు విజ్ఞప్తి. కర్నాటక 40 శాతం అవినీతి సరే… రాష్ట్రంలో 70శాతం కమిషన్‌పై మా పార్టీ కాంగ్రెస్‌ పోరాటం చేయాలి. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని మౌనంగా ఉంటున్నారు.రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీడ పురుగుగా మారారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నిధుల లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. 2004లో సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేసిన కష్ణారెడ్డి…దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్‌గా ఎలా ఎదిగారో చెప్పాలని నాగం ప్రశ్నించారు.