ఐఈఆర్పీలను రెగ్యులరైజ్‌ చేయాలి

– సీఎం కేసీఆర్‌కు టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర శిక్ష ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నియామకమై 19 ఏండ్లుగా పనిచేస్తున్న ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రీసోర్స్‌ పర్సన్లు (ఐఈఆర్పీ)ను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి సోమవారం వినతిపత్రం సమర్పించారు. నూతనంగా మంజూరు చేసిన 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వాటిని డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే 763 మంది ఐఈఆర్పీలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. వారికి అన్ని అర్హతలూ ఉన్నాయని వివరించారు. రాతపరీక్ష ఆధారంగా మెరిట్‌, రోస్టర్‌ ప్రాతిపదికన ఎంపిక చేశారని తెలిపారు. మానవతా దృక్పథంతో వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.