– ఆశా వర్కర్లకు రూ.18వేలు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలి
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
ఆశా వర్కర్లు కష్టపడి పని చేస్తేనే దానివల్ల వచ్చే ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా అనుభవిస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి పేర్కొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెలో రెండో రోజు చర్ల మండల కేంద్రంలో బ్రహ్మచారి పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించాలని, పారితోషకాలు లేని పనులు ఆశా వర్కర్లతో చేయించవద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కారం చేయటానికి వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించాలని లేకపోతే సమ్మె తీవ్రస్థాయిలో కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బి.రమేష్, నాయకులు సత్రంపల్లి సాంబశివరావు, సీఐటీయూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కార్యదర్శి పాయిం చంద్రకళ, యూనియన్ నాయకులు సుజాత, హైమా, అనూష, కనకమ్మ, సబితా, రాధా తదితరులతో పాటు మండలంలోని ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు.
ఇల్లందు : తహశీల్దార్ కార్యాలయం వద్ద గత 16రోజులుగా, మెయిన్ రోడ్ హై స్కూల్ వద్ద గత రెండు రోజులుగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈ సమ్మె శిబిరాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుల్తాన మంగళవారం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, కూకట్ల శంకర్, కేవీపీఎస్ మన్యం మోహన్ రావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కామ నాగరాజు, సత్యనారాయణ కోరి,కోటేశ్వరరావు, భద్రు, ఐద్వా నాయకురాలు తాళ్లూరి పద్మలు సంఘభావం తెలిపారు. ఈ నిరవధిక సమ్మెలలో అంగన్వాడీ నుండి జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ,కే మరియ, ఫాతిమా, మమత, నాగలక్ష్మి, వసంత, బత్తుల దేవేంద్ర, దీప్తి, కారం పద్మ, అరుణలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం :అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న హెచ్చరించారు. అంగన్వాడీలు స్థానిక బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్ పార్క్ ఎదురుగా గత 20 రోజులుగా నిరస సమ్మె దీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా చెవిలో పువ్వు… చేతిలో చిప్ప.. పట్లుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ ప్రధాన కూడళిలో అంగన్వాడీలు చేరి దారివెంట వెళ్లే వారికి చిప్ప చూపిస్తు వేడుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు పద్మ, కళావతి, శైలజ, అరుణ, జుబేదా, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ఎం.వి.అప్పారావు
ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి. అప్పారావు అన్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆశా వర్కర్ల రెండో రోజు సమ్మె దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, ఆశ వర్కర్ల నాయకురాలు జయ, మనీలా లక్ష్మి, దేవి, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఆశా వర్కర్ల రెండో రోజు సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ ప్రారంభించి మాట్లాడారు. ఆశ వర్కర్ల నాయకురాలు రమాదేవి, రుక్మిణి, పుణ్యవతి, శిరోమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఆశాలకు సీపీఐ(ఎం) మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వేణు, రామడుగు వెంకటాచారి పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి/గుండాల : ఆశావర్కర్లకు 18వేలు ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి ఎస్.హెచ్.సుల్తానా, ఎస్.డీ.అబ్దుల్ నబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా రెండో రోజు మంగళవారం ఆళ్ళపల్లి, గుండాల మండల కేంద్రాల్లో ఆశా వర్కర్ల సమ్మెకు వారు చేరుకుని మాట్లాడారు. అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు వజ్జ సుశీల గుండాల తహసీల్ వద్ద ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మెలో మాట్లాడారు.
మలకలపల్లి : ఆశావర్కర్ల సమ్మెకు తిమ్మంపేట సర్పంచ్ గౌరి లక్ష్మి సంఘీభావం తెలిపారు. సర్పంచ్ గౌరి లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు పొడియం వెంకటేశ్వర్లు, గౌరి నాగేశ్వరరావు, రవికుమార్, జి.లక్మినర్సయ్య, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి దుబ్బా ధనలక్ష్మి, ఆశావర్కర్లు జయ, పాల్గొన్నారు.