మీ పాపకి నిద్ర సరిగ్గా పట్టడం లేదా… కడుపునిండా పాలు తాపినా పడుకోడానికి కష్టపడుతున్నారా… అయితే ఆ తప్పు వారిది కాదు, మీదే! అవును… బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి డిప్రెషన్‌కి గురైతే ఆ ప్రభావం పుట్టిన పిల్లలపై పడుతుందని అంటున్నారు నిపుణులు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.
గర్భవతి అయిన తర్వాత మూడు నుంచి ఏడు మాసాల కాలం చాలా విలువైనది. ఈ సమయంలో తల్లి మానసిక స్థితి, ఆనందం, ఆమె ఆలోచనలూ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి ఎంత ఆనందంగా ఉందనే విషయం బిడ్డ నిద్రపోయే సమయాన్ని నిర్ణయిస్తుందట. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా తల్లి కాబోతున్న విషయాన్ని ఎంజారు చేసే తల్లులకు పుట్టిన పిల్లలు… మిగిలిన వారితో పోలిస్తే సుఖంగా నిద్రపోతున్నారట. అలాకాకుండా అనేక ఆలోచనలతో సతమతమవుతూ మానసికంగా కుంగిపోయి డిప్రెషన్లో కూరుకుపోయే వారి పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నారు.
అయితే తల్లి కాబోతున్నప్పుడు మహిళల్లో అనేక రకాల ఆలోచనలూ, భయాలు మొదలవుతాయి. వీటి నుంచి బయటపడి మాతృత్వాన్ని ఎంజారు చేసేలా చేయాల్సిన బాధ్యత వారి భర్తలు, కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మస్థైర్యం పెంచుతూ, ఒత్తిడిని దూరం చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా గర్భవతి అని చూడకుండా ఆమెని తిట్టినా, అవమానించినా, చులకన చేసి మాట్లాడిన ఆ ప్రభావం బిడ్డ మానసిక పరిస్థితిపై పడుతుందని ఈ అధ్యయనంలో నిరూపితమైంది.
అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లేకపోతే పుట్టబోయే పిల్లలపై ఆ ప్రభావం చాలారోజుల పాటు ఉంటుంది. అమెరికాలో 833 మంది పిల్లలపై చేసిన సర్వేలో ఈ విషయాలు తేలాయి. వీరంతా ఆరేండ్లలోపు పిల్లలే. పిల్లలు నిద్రపోయే సమయం, వీరు తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడు మానసిక స్థితి ఆధారంగా ఓ డేటా తయారు చేశారు. ఇందులో తల్లికి మానసిక స్థితి, బిడ్డ ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా నిర్ధారణ అయ్యింది. ఈ సర్వే రిపోర్టును ‘స్లీప్ 2018’ సమావేశంలో వెల్లడించారు.