మూడ్రోజులు వడగాల్పులు.. ఉక్కపోతే

– తంగులలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
– తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని సూచించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, మంచిర్యాల, నిర్మల్‌, కొమ్రం భీమ్‌ అసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశమున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా తంగులలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలో వందకుపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. 15 ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేటలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.