పెన్షన్‌ సౌకర్యం అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తారా..

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
ఐసీడీఎస్‌ ద్వారా 48 సంవత్సరాలుగా ప్రజలకు పోషకాహారాన్ని అందించటం, ప్రీస్కూలు విద్యను అందించడం, గర్భిణీలు బాలింతలు పసిపిల్లల సంక్షేమాన్ని నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మినీ టీచర్లకు సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని కనీస వేతనం 26000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సమ్మె చేస్తుంటే టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లను కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని సీఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి ప్రశ్నించారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీ టీచర్లు చర్ల అంబేద్కర్‌ సెంటర్‌ నందు భారీ స్థాయిలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐజియూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం విజయశీల అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ సిబ్బంది పెద్దపెట్టను నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు మండల కన్వీనర్‌ పాయం రాధాకుమారి, మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు చర్ల ప్రాజెక్టు అధ్యక్షురాలు పాలెం నాగమణి నాయకురాళ్లు కమల మనోహరి తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీిల మానవహారం
ఇల్లందు : అంగన్‌వాడీల సమ్మెలో బాగంగా మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలంతా మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సీఐటీయూ ఏఐటియుసి జిల్లా నాయకులు అబ్దుల్‌ నబీ సిహెచ్‌ సీతామాలక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఈసం వెంకటమ్మ, మరియా, ఫాతిమా, మమత, రాంబాయి పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో ప్రధాన సెంటర్‌ నందు మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల, శ్రీదేవి, పద్మ, భారతి, సరస్వతి, రాధ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : మండల కేంద్రంలో ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చి ప్రధాన సెంటర్‌ గాంధీ విగ్రహం వద్ద మానవహారంతో నిరసన తెలిపారు.