ఊబకాయం.. ఇటీవల ఈ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం వల్ల కూడా చిన్నారులు సైతం ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే ఊబకాయంతో మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఊబకాయంతో వచ్చే ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక బరువు డయాబెటిక్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు టైప్-2 మధుమేహం వస్తుంది. అధిక బరువు సమస్య దాని బారిన పడిన ప్రతి 10 మందిలో 9 మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. అధిక రక్త చక్కెర కాలక్రమేణా పెరుగుతుంది, ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు, నరాల రుగ్మతలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అధిక బరువు కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాలేయం దెబ్బతినడానికి, కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కి ఊబకాయం ఒక కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక సాధారణం కంటే ఎక్కువ బరువు ఉన్న వ్యక్తులు రక్తపోటు సంబంధించిన సమస్యలకు ఎక్కువగా గురవుతుంటారు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, రక్తం ఒత్తిడి రక్త నాళాల గోడలపై కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా అధిక రక్తపోటు మూత్ర పిండాలను దెబ్బ తీస్తుందని చాలా అధ్యయనాలు ఉన్నాయి.