సమస్యలను పరిష్కరించాలంటే.. కేసులా..?

– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
ప్రభుత్వ విద్యారంగం, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై అక్రమ కేసులను కొట్టేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని 10వ డివిజన్‌ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను కొట్టి, అక్రమ కేసులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రియింబర్స్‌మెంట్‌ విడుదల చేయడంలో సోయిలేని ప్రభుత్వం.. శ్మశాన వాటికలకు, ప్రభుత్వ నూతన కార్యాలయాల భవనాల నిర్మాణాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ.. విద్యారంగాన్ని మాత్రం నీరుగారుస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు, గణేష్‌, సాయి, రాహుల్‌, విశాల్‌, ఆసిఫ్‌ పాల్గొన్నారు.