– ఆపించమంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గం
– విలేకర్లతో కొత్తూరు, కూసంపూడి, గొర్ల, గాదె
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపాలని చూస్తే అదే పెద్ద ఉద్యమంగా మారి మీ మెడలకు ఉరితాళ్లుగా మారతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, బీఆర్‌ఎస్ రాజకీయ సమన్వకర్త గాదె నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిం చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బీఆర్‌ఎస్ ఎన్నికల కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలను నిలిపి వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నాయకులు ఫిర్యాదు చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికిప్పుడే ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకాలు కావన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు ఇలా అనేక పథకాలు పద్ధతి ప్రకారం సజావుగా అమలు కావడానికి అవన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. అమలవుతున్న పథకాలను ఆపే ముచ్చటే లేదన్నారు. అంతా తెలిసి ఇంకా ఆపాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతాయని, పంటలు వేసే ముందు ప్రభుత్వ పెట్టుబడి అందుతుందని బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్తు ఒక్క తెలంగాణలో మాత్రమే అమలవుతోందన్నారు. ఇది మేం చెప్పింది కాదని, సాక్షాత్తూ ఆర్‌బీఐ ఇచ్చిన నివేదికని వారన్నారు. నిన్నగాక మొన్న కర్నాటకలో అబద్దతపు హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ ఆ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. అక్కడి ప్రజలు, రైతులు కాంగ్రెస్‌ను ఎందుకు నెత్తినెక్కించుకున్నామా అంటూ నిట్టూరుస్తున్నార న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉచిత విద్యుత్తు పథకంలో 35లక్షల మోటార్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 25వేల కోట్లను ఖర్చుపెట్టడమనేది సామాన్య విషయం కాదన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, దేవరపల్లి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.