‘భారత్‌మాల’తో భారీ ఇబ్బందులు

– వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌జామ్‌లు
– ఐదేండ్లుగా ఎలివేటేడ్‌ కారిడార్‌ పనులు
– ఉప్పల్‌-నారపల్లి రోడ్డుకు మోక్షం
– సీఎం కేసీఆర్‌ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్లు, ప్లైఒవర్ల పనుల్లో తీవ్ర జాప్యం కనిపిస్తున్నది. నిధుల విడుదలలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఉప్పల్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు నిర్మాణమే ఇందుకు సాక్ష్యం. వర్కింగ్‌ ఏజెన్సీ చురుగ్గా పనిచేయకపోవడంతో ఐదేండ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమమవుతున్నాయి. కేంద్రం ప్రారంభించిన ఒకే ఒక్క ప్రాజెక్టు ఏండ్లతరబడి ఆపసోపాలు పడుతుండగా, వాహనదారుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సాధారణంగా తరచుగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడే ఉప్పల్‌ ప్రాంతంలో, వర్షాల నేపథ్యంలో మరిన్నీ ఇక్కట్లు తప్పడం లేదు. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టు పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఐదేండ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 40 శాతం కూడా పూర్తికాలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రెండేండ్లలోనే 6.2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేసి జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ)కి జీహెచ్‌ఎంసీ అప్పగించింది. కానీ పనుల పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రోడ్డు మధ్యన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉప్పల్‌, నారపల్లి మధ్య ప్రయాణానికి కనీసం గంటకుపైగా సమయం పడుతున్నది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు ప్రయాణం నరకప్రాయమవుతున్నది. ఉప్పల్‌ రింగ్‌రోడ్డు, బోడుప్పల్‌, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, పండుగల సమయంలోనైతే ప్రయాణీకుల బాధలు వర్ణనాతీతం. ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగి వాహనదారుల్లో అసహనం పెంచుతున్నది.
ప్రాజెక్టు ఉద్దేశం..
ఉప్పల్‌ – మేడిపల్లి మధ్య ట్రాఫిక్‌ సమస్యకు చరమగీతం పాడేందుకు ఈ ఆరు లేన్ల స్కైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 163 జాతీయ రహదారిపై 6.2 కిలోమీటర్ల మేర 148 పిల్లర్లతో పనులకు శ్రీకారం చుట్టారు. 2018 జూలైలో పనులు ప్రారంభం కాగా, 2020 జూన్‌ వరకు నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం. ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్‌ పనులు పూర్తయితేనే దెబ్బతిన్న రోడ్డు పనులు పూర్తిచేయగలమని అధికారులు అంటున్నారు.
భారత్‌మాల…
ఉప్పల్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద చేపట్టింది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రూ.626.80 కోట్ల వ్యయంతో ఉప్పల్‌-నారపల్లి మధ్య నిర్మిస్తున్న ఈ ఆకాశ మార్గానికి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 2018, మే నెలలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఐదేండ్లు గడిచినా 40 శాతం పనులే పూర్తయ్యాయనీ, ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తే ఈ ఫ్లై ఓవర్‌ మరో రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు, రోడ్డు పనులు తీవ్ర ఆలస్యమవుతుండంతో ఉప్పల్‌ ప్రధాన రహదారిలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యాపార సముదాయాల వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసే అవకాశమే లేదు. లాభం కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. పనులు పూర్తిచేసి, రోడ్ల నిర్మాణం జరిగితే కనీసం వ్యాపారం కొనసాగించడానికి వీలుంటుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాలు, ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడానికి సిబ్బంది చాలా శ్రమించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉప్పల్‌-నారపల్లి రోడ్డు పనులు పూర్తిచేసి ట్రాఫిక్‌ సమస్యలను నివారించాలని ఆయన ఆదేశించారు. ఈమేరకు ఆపనులపై ఆర్‌అండ్‌బీ శాఖ దృష్టిసారించింది.