ఆగస్టు, సెప్టెంబరుల్లో సాధారణ వర్షపాతమే : ఐఎండి అంచనా

– జూలైలో అంచనాకు మించి వర్షపాతం నమోదు
న్యూఢిల్లీ : రుతుపవనాల కారణంగా రానున్న ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే తూర్పు, మధ్య భారతదేశంతో పాటు, ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. హిమాలయాల వెంబడి కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజరు మహాపాత్రా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలిపారు. జూలై నెలలో దేశవ్యాప్తంగా 13 శాతం అధికంగా వర్షపాతం నమోదయిందని చెప్పారు. అయితే తూర్పు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 1901 సంవత్సరం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, వాయువ్య భారతదేశంలో 2001 తరువాత అత్యధిక వర్షపాతం (258.6 మీమీ) నమోదయిందని తెలిపారు. మొత్తంగా ఈ రుతుపవనాల సీజన్‌లో జూన్‌లో దేశవ్యాప్తంగా 9శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జులైలో 13శాతం అధికంగా వర్షపాతం నమోదయిందని చెప్పారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అంచనా వేసిన వర్షపాతం కంటే 5 శాతం అధికంగా (445.8 మీమీ) వర్షపాతం కురిసిందని చెప్పారు. భారత్‌లో రుతుపవనాల సీజన్‌ మొత్తం నాలుగు నెలల్లో తొలి రెండు నెలలను జూన్‌, జూలైను తొలి అర్థభాగంగానూ, ఆగస్టు-సెప్టెంబరు నెలలను రెండో అర్థభాగంగానూ పేర్కొంటారు.