మహిళా ఉద్యోగులపై ఏఐ ప్రభావం

– ఐఎల్‌ఓ నివేదిక
న్యూఢిల్లీ :
 కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అభిప్రాయపడింది. అయితే అదే సమయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం నూతన అవకాశాలు కూడా సృష్టిస్తుందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. అనేక ఉద్యోగాలు, పరిశ్రమలు ‘ఆటోమేషన్‌’పై పెద్దగా ఆధారపడవని, కాబట్టి ఏఐ పరిజ్ఞానం ఉద్యోగులకు సహాయకారిగా ఉంటుందే తప్ప వారికి పూర్తి ప్రత్యామ్నాయం కాజాలదని వివరించింది. మేనేజర్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ వంటి ఉద్యోగాలు చేసే వారికి ఆటోమేషన్‌ అవసరం అంతగా ఉండదని అంటూ కార్యాలయాలలో గుమస్తా విధులు నిర్వర్తించే వారిపై మాత్రం ఏఐ ప్రభావం అధికంగా ఉండవచ్చునని అంచనా వేసింది. గుమస్తాలకు ఆటోమేషన్‌ అవసరం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వీరిపై ఏఐ ప్రభావం అనివార్యమని తెలిపింది.
పురుషులతో పోలిస్తే కార్యాలయాలలో దిగువ స్థాయి ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని, ఈ నేపథ్యంలో ఏఐ ప్రభావంతో వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా సంపన్న దేశాలలో ఈ పరిస్థితి కన్పిస్తుందని తెలిపింది. ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, సాంకేతిక మార్పిడుల ఫలితంగా చోటుచేసుకునే లింగ అసమానతలను నివారించడానికి వ్యూహాలు రూపొందించాలని సూచించింది.
కృత్రిమ మేథ పరిజ్ఞానం ఉద్యోగులకు సహాయకారిగా ఉంటుందే తప్ప వారిని రోడ్డున పడేయబోదని నివేదిక భరోసా ఇస్తున్నప్పటికీ బాధిత ఉద్యోగులపై దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించింది కూడా.
ఏఐ తెచ్చే మార్పుల కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం జరగదు కానీ కొన్ని రకాల ఉద్యోగాలపై మాత్రం తప్పనిసరిగా ప్రభావం పడుతుంది. ప్రతికూల పరిణామాలను నివారించి, అంతా సజావుగా సాగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.