– రూ.144 కోట్లతో మౌలిక వసతుల కల్పన
– సీఎస్‌ఆర్ కింద రూ.20 కోట్లు : ఓయూ వీసీ రవీందర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలైతే ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో విప్లవాత్మక మార్పులొస్తాయని ఆ వర్సిటీ ఉపకులపతి (వీసీ) డి రవీందర్ చెప్పారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసేలా సీసీఈని అమలు చేయనున్నట్టు వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యామండలి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ప్రకారం ఓయూ కాన్‌స్టిట్యూయెంట్ కాలేజీల్లోని పీజీ కోర్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు. ఇందులో ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్లు, స్లిప్‌టెస్ట్‌లు, బృంద చర్చలుంటాయనీ, వాటికి ఎప్పటికప్పుడు మార్కులను నిర్ణయించి గ్రేడ్లను కేటాయిస్తామని వివరించారు. సెమిస్టర్ పరీక్షల ద్వారా విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తున్నామనీ, దానివల్ల వారిలోని సంపూర్ణ జ్ఞానాన్ని పూర్తిగా పరీక్షించడానికి వీలు కావడం లేదని చెప్పారు. అందులో భాగంగానే ఓయూలో సీసీఈ అమలుకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. ఇప్పటికే ప్రొఫెసర్లతో దీనిపై అధ్యయనం చేసి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. సెమిస్టర్ ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. సీసీఈలో పరీక్షలను నిర్వహించిన వెంటనే మార్కులను కేటాయిస్తామని చెప్పారు. దానివల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఓయూ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఈ రెండేండ్ల కాలంలో రూ.144 కోట్లు కేటాయించామని చెప్పారు. కొత్త హాస్టళ్లు, ఉన్న వాటి మరమ్మత్తులు, శతాబ్ది ఉత్సవాల పైలాన్ వంటి నిర్మాణాలు చేపట్టామని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్‌ఆర్) కింద మరో రూ.20 కోట్ల వరకు సమీకరించామన్నారు. వాటికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఓయూ అల్యూమ్ని ద్వారా నిధుల సేకరణతోపాటు వర్సిటీలో చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఓయూ అల్యూమ్నిలో ఉండి తెలంగాణలో పరిశ్రమలను స్థాపించిన వారి సహకారాన్ని తీసుకుంటామని అన్నారు. సివిల్ సర్వీసెస్ అకాడమి ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. అయితే పరిశోధనల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ర్యాంకును మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మాణికేశ్వర్‌నగర్‌లో వందపడకల ఆస్పత్రి
ఓయూలో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులతోపాటు విద్యార్థుల కోసం మాణికేశ్వర్‌నగర్‌లో వంద పడకల ఆస్పత్రిని నెలకొల్పనున్నట్టు రవీందర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని అన్నారు. దానికోసం ఎకరం స్థలం అందుబాటులో ఉందని వివరించారు. ఇటీవలే వర్సిటీలో ఓ విద్యార్థికి పాము కాటేస్తే గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అత్యవసర పరిస్థితి వచ్చినపుడు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తున్నదనీ, దానివల్ల ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే వర్సిటీ దగ్గరలో ఆస్పత్రి ఉంటే మెరుగైన సేవలు పొందడానికి అవకాశముంటుందని వివరించారు. ఇందులో స్థానిక ప్రజలకూ సేవలందుతాయని చెప్పారు. అయితే వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రత్యేకంగా బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు. అడిక్‌మెట్ నుంచి శివం రోడ్డు వరకు రూ.16 కోట్లతో లింకు రోడ్డు మంజూరైందని అన్నారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. ఆ రోడ్డు పూర్తయ్యాక వర్సిటీలోకి అందరికీ ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైనా గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.