– సామాజిక చైతన్య యాత్ర
– ఆగస్టు 2 నుంచి 18 వరకు
– పోస్టర్‌ను ఆవిష్కరించిన కేజీకేఎస్ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర నిర్వహించనున్నట్టు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం( కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. అగష్టు రెండున బొల్లగాని పుల్లయ్య 35 వ వర్ధంతి నుంచి 18 న సర్వాయి పాపన్న 373 వ జయంతి వరకు సామాజిక చైతన్య యాత్ర ‘అమరుల యాదిలో’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు జరిపి, అమరుల త్యాగాలను నేటి సమాజానికి తెలుపుతామనీ, కల్లుగీత వృత్తిలో ఉపాధి – ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రచారం చేస్తామని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను గత 20 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 2 నుంచి 18 వరకు 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన బొమ్మగాని ధర్మ భిక్షం, యస్ ఆర్ దాట్ల, తొట్ల మల్సూర్, దేశిని చిన్న మల్లయ్య, పెరుమాండ్ల జగన్నాదం, బొల్లగాని పుల్లయ్య, వర్దెల్లి బుచ్చి రాములు, బైరు మల్లయ్య తదితర సంఘ నాయకులను స్మరించుకుంటూ ఈ యాత్రలు సాగుతాయని పేర్కొన్నారు. సామాజిక సేవకులు, సంఘ సంస్కర్తలు పూలే, సావిత్రి బాయి పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, సాహూ మహరాజ్, అంబేద్కర్ లాంటి మహానుబావుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలియజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, సేవా కార్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనం, సేఫ్టీ మోకులు ఇవ్వాలనీ, వృత్తిదారులకు ఇస్తామన్న రూ. లక్ష ఆర్థిక సాయాన్ని గీత కార్మికులందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయకపోతే సెప్టెంబర్‌లో వేలాది మందితో హైదరాబాదులో ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు,బొలగాని జయరాములు,గోవింద్, గౌని వెంకన్న, బాల్నే వెంకటమల్లయ్య, వి వెంకటనర్సయ్య, పామనగుళ్ల అచ్చాలు, కార్యదర్శులు చౌగాని సీతరాములు, ఎస్ రమేష్‌గౌడ్, బండ కింది అరుణ్, గాలి అంజయ్య, మడ్డి అంజిబాబు, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.