పెరిగిన రైల్వే ప్రయాణికులు

– ద.మ.రైల్వే స్థూల ఆదాయం రూ.18973.14 కోట్లు
– 2024 జనవరి నాటికి ఎమ్‌ఎమ్‌టీస్‌ రెండోదశ పూర్తి
– సరుకు రవాణాలోనూ రికార్డు: 2022-23 వార్షిక నివేదిక వెల్లడించిన జీఎమ్‌ అరుణ్‌కుమార్‌జైన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12.70 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించగా, 2022-23లో వీరి సంఖ్య 25.50 కోట్లకు పెరిగింది. ఈ విషయాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సోమవారంనాడిక్కడి రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సాధించిన ఆర్థిక, సాంకేతిక, సామర్థ్య పురోగతిని ఆయన వివరించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022-23) రూ.18,973.14 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశామన్నారు. 2018-19లో ఈ ఆదాయం రూ.15,708.88 కోట్లు కాగా, 2021-22లో రూ. 14,266 కోట్లుగా నమోదైందన్నారు. గతేడాది 131.854 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ. 13,051.10 కోట్ల ఆదాయాన్ని గడించారు. కోవిడ్‌ తర్వాత ప్రయాణీకుల రైళ్ల విభాగంలో వందశాతం మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరిగి ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రైల్వే ప్రయాణీకుల నుంచి టిక్కెట్ల ఆదాయం 2022-23లో రూ. 5,140.70 కోట్లు వచ్చింది. 2018-19లో ఈ ఆదాయం రూ. 4,089.78 కోట్లు. అలాగే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రెండోదశ పనులు 2024 జనవరి నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.1,169 కోట్లు కాగా, దానిలో రాష్ట్ర వాటా రూ.779 కోట్లు, కేంద్రం వాటా రూ.390 కోట్లు ఉందన్నారు. దీనిలో రాష్ట్రవాటా కింద రూ.379 కోట్లు అందాయని వివరించారు. రైలు ప్రయాణీకులు విచారణ, ఇతర సమాచారాల కోసం 139 యూనివర్సల్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలనీ, ఆన్‌లైన్లలోని నెంబర్లకు ఫోన్లు చేసి మోసపోవద్దని హెచ్చరించారు. అలాగే నడుస్తున్న రైళ్లపై రాళ్లు వేయోద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే నిందితులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైళ్లకు పంపుతామన్నారు. రైలు నెట్‌వర్క్‌ ట్రాక్‌ను 384.42 కి.మీ., జోడించినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 50.015 కి.మీల కొత్త లైన్లు, 151.486 కి.మీ డబుల్‌ లైన్లు, 182.915 కి.మీ మూడో లైన్లు రైలు నెట్‌వర్క్‌ పనులు పూర్తిచేశామని తెలిపారు. 1,016.9 కి.మీ., విద్యుద్దీకరణ చేశామన్నారు. ప్రస్తుతం జోన్‌ పరిధిలో 1,743.42 రూట్లలో రైలు వేగం 130 కి.మీ.గా ట్రాక్స్‌ను అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. 66 ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లను ప్రారంభించామన్నారు. 2022-23లో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగలేదని తెలిపారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ ధనుంజయులు , ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ బీ నాగ్య, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కేఆర్కే రెడ్డి, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, (కన్‌స్ట్రక్షన్‌) నీరజ్‌ అగర్వాల్‌, ప్రిన్సిపాల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పీడీ మిశ్రా, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.