ఆగస్టు 25, 26 తేదీల్లో ‘ఇండియా’ కూటమి భేటీ

– ముంబయి వేదికగా సమావేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాల కూటమి ఇండియా తదుపరి సమావేశం ముంబయిలో జరగనుంది. ఆగస్టు 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. మూడో సమావేశం ముంబయిలో జరగనుంది. కాంగ్రెస్‌ ఆతిథ్యం లో జులై 17, 18 తేదీల్లో జరిగిన బెంగళూరు సమావేశంలోనే కూటమి పేరును ఖరారు చేశారు. ఈ సమావేశానికి 26 ప్రతిపక్ష పార్టీలు హాజర య్యాయి. జూన్‌ 23న పాట్నాలో నితీశ్‌ కుమార్‌ ఆతిథ్యం ఇచ్చిన ప్రతిపక్షాల సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి.ముంబయిలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో కో-ఆర్డినేషన్‌ కమిటీ, జాయింట్‌ సెక్రెటేరియట్‌, ఇతర ప్యానల్స్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ
ముంబయి సమావేశంలో 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి కన్వీనర్‌ను కూడా ముంబయి సమావేశంలో ఎన్నుకుంటారు.