– గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ అలా
– అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు
– ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు అందజేత
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది దేశ భక్తుల, త్యాగల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, బ్రిటీష్ పాలన అనంతరం సంపూర్ణ స్వరాజ్యం సిద్దించి, భారత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యంగా, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్ దేశం అవతరించిందని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. గౌరవ వందన చేశారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత మనల్ని మనం పరిపాలించు కోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మెన్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఎన్నుకున్నారని చెప్పారు. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26ను నాటి నుండి గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యం లభించిందని చెప్పారు. ఇప్పటి వరకు 10 లక్షల 19వేల200మంది మహిళలు బస్సులో ప్రయాణించారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలకు రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల చెంతే పాలన వచ్చిందని చెప్పారు. 252 మందికి వైద్య సేవలు అందినట్లు చెప్పారు. అభయ అస్తంలో జిల్లాలో 3 లక్షల 34 వేల 227 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి గ్రామం యూనిట్‌గా ప్రణాళికలు రూపకల్పనలో ప్రభుత్వం ముందుకెల్తుందని చెప్పారు. అందరి సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమసేవలు అందించినందుకు పలువుర అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.