సూడాన్‌ సంక్షోభానికి పసికందుల బలి

– ఆకలిలో అలమటించి 60 మంది చిన్నారుల మృతి
– ఖార్తూమ్‌లో హృదయవిదారక దృశ్యాలు
ఖార్తూమ్‌: సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు ప్రజలను కల్లోలంలోకి నెట్టేస్తోంది. రాజధాని నగరమైన ఖార్తూమ్‌లోని ఒక అనాథ శరణాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ఇప్పుడు విశ్వమానవాళిని కంటతడి పెట్టిస్తున్నాయి. పాలు తాగే వయసులో ఉన్న పసి మొగ్గలు పాలు, సరైన ఆహారం, కనీస వైద్యం అందక ఆకలితో అలమటించి అసువులు బాసారు. ఈ ఒక్క అనాథశరణాలయంలోనే ఆరు వారాల్లో దాదాపు 60 మంది పైగా పసిబిడ్డలు ప్రాణాలు కోల్పో యారు. వీరిలో 26 మంది గత రెండు రోజుల్లోనే తనువు చాలించారు. తగిన ఆహారం లభించకపోవడం, జ్వరం చిన్నారుల మరణాలకు కారణంగా తెలుస్తోంది. కొన్ని దృశ్యా ల్లో అయితే చంటి బిడ్డలను ఖననం చేసేందుకు తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఉంచారు. ఒక గదిలో నేలపైనే పదుల సంఖ్యలో పసి పిల్లలు ఏడుస్తూ కనిపించారు. పాలుకు బదులుగా ఒక మహిళ రెండు జగ్గుల నీరు తీసుకెళ్లి పసి కందులకు తాగించడం హృదయాన్ని ద్రవింపచేస్తోంది. ఈ కథనాల నేపథ్యంలో సూడాన్‌ పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవు తుండటంతో యునిసెఫ్‌, రెడ్‌క్రాస్‌ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అనాథ పిల్లలకు ఆహారం, మందు లు, ఇతర అత్యవసరాలను సరఫరా చేస్తున్నాయి. 1.36 కోట్ల మంది చిన్నారులకు మానవతా సాయం అవసరమని యునిసెఫ్‌ ప్రకటించింది. సూడాన్‌ ప్రస్తుతం సైన్యం, పారా మిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో కల్లోలి తంగా మారింది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు నిత్యకృత్యంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు బతుకుజీవుడా అంటూ వలసలు పోతున్నారు. ఇప్పటివరకు 16.5 లక్షల మంది ప్రజలు స్వస్థలాలను వీడి వలసెళ్లారు. వేలాది మంది దేశాన్ని కూడా వీడి వెళ్లిపోతున్నారు. ఘర్షణ ల కారణంగా ఇప్పటి వరకు 900 మంది చనిపోయి వుంటారని సూడాన్‌ డాక్టర్స్‌ సిండికేట్‌ సంస్థ వెల్లడించింది. వీరిలో 200 మంది చిన్నారులే ఉన్నారు. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.