వాస్తవ సంఘటన స్ఫూర్తితో..

శ్రీకష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరికష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. సత్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను హీరో వరుణ్‌ తేజ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సత్యం రాజేష్‌ నటించిన ‘మా ఊరి పొలిమేర’ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్ర టీజర్‌ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటి పార్ట్‌లా సెకండ్‌ పార్ట్‌ కూడా పెద్ద హిట్‌ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. ‘ఫస్ట్‌ పార్ట్‌ కన్నా రెండో పార్ట్‌ను దర్శకుడు అనిల్‌ అంతకు మించి చేశాడు. స్క్రీన్‌ప్లే, డైరక్షన్‌ నాకు చాలా బాగా నచ్చింది. సత్యం రాజేష్‌, కామాక్షి పోటాపోటీగా నటించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెలాఖరులో లేదా ఆగస్ట్‌ మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని నిర్మాత గౌరికష్ణ అన్నారు.
దర్శకుడు డా.అనిల్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ, ‘ఒక రియల్‌ ఇన్స్‌డెంట్‌ స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి.. పాత్రలకు తగ్గట్టుగా బోల్డ్‌ డైలాగ్స్‌, సీన్స్‌ ఉంటాయి తప్ప..ఎక్కడా కావాలని ఏదీ పెట్టలేదు. నిజంగా బ్లాక్‌ మ్యాజిక్‌ ఉందా? లేదా? అనే డిబేట్‌ మీద వెళ్లలేదు. ఒక వేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాం. సెకండ్‌ పార్ట్‌లో పద్మనాభ స్వామి టెంపుల్‌ అంశాన్ని కూడా లైట్‌గా టచ్‌ చేసే ప్రయత్నం చేశా. అది ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అని తెలిపారు. సత్యం రాజేష్‌ మాట్లాడుతూ,’టీజర్‌ లాంచ్‌తో సినిమా పై మరింత హైప్‌ పెంచిన వరుణ్‌ తేజ్‌కి ధన్యవాదాలు. ఇందులో పవర్‌పుల్‌ రోల్‌ చేశాను. నటుడుగా నన్ను మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది’ అని అన్నారు.