ఇంటర్‌ ప్రవేశాల గడువు 16 వరకు పొడిగింపు

– ఆలస్య రుసుం లేకుండా 6 వరకు అవకాశం
– ప్రయివేటు కాలేజీల్లో చేరాలంటే రూ.500 కట్టాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈనెల 16 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల ఆరో తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చేరేందుకు అవకాశముందని సూచించారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లో ఆలస్య రుసుం లేకుండా ఈనెల 16 వరకు చేరేందుకు అవకాశముందని వివరించారు. ఈనెల ఏడు నుంచి 16 వరకు ప్రయివేటు కాలేజీల్లో చేరాలంటే రూ.500 కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఆ కాలేజీల జాబితాను పొందుపర్చామని వివరించారు.
ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి టిప్స్‌ కృతజ్ఞతలు
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ప్రవేశాలకు అవకాశం కల్పించిన ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు తెలంగాణ ఇంటర్‌ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్‌) కృతజ్ఞతలు తెలిపింది.