ఇంటర్‌నెట్‌ నిషేధం ఓ భారీ తప్పిదం

– మెయితీల గుప్పెట్లోనే మీడియా ఎడిటర్స్‌ గిల్డ్‌ నివేదిక
న్యూఢిల్లీ: మణిపూర్‌లో మైనార్టీ కుకీలపై పెద్దయెత్తున దాడులు, హింస చోటుచేసుకున్న సమయంలో ఇంటర్‌నెట్‌ను రాష్ట్రవ్యాపితంగా నిషేధించడం పెద్ద తప్పిదమని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) పేర్కొంది. ఇంటర్‌నెట్‌ నిషేధంతో రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా దిగజారాయని తెలిపింది. ఇజిఐకు చెందిన నిజనిర్ధారణ బృందం ఆగస్టు 7 నుంచి 10 వరకూ మణిపూర్‌లో పర్యటించింది. ఈ బృందంలో సీమా గుహ, భరత్‌ భూషణ్‌, సంజరుకపూర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఇటీవల 24 పేజీలతో కూడిన నివేదికను ఆదివారం నాడిక్కడ విడుదల చేసింది. ‘మణిపూర్‌లో మెయితీ ప్రభుత్వం, మెయితీ పోలీసులు, మెయితీ అధికారులు ఉన్నారు. కొండల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు వీరిపై విశ్వాసం లేదు’ అని నివేదిక పేర్కొంది. మణిపూర్‌ అంటే మెయితీ మీడియా అని పేర్కొంది. ఈ మెయితీ మీడియా భద్రతా బలగాలపై, ముఖ్యంగా అస్సాం రైఫిల్స్‌పై విష ప్రచారాన్ని వ్యాప్తి చేసిందని నివేదిక వెల్లడించింది. ‘మణిపూర్‌లో మీడియా తన ప్రజల అభిప్రాయాలుగా చెబుతూ అస్సాం రైఫిల్స్‌కు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేస్తూ తన విధి నిర్వహణలో విఫలమైంది. వాస్తవాలను వెల్లడించడంలోనూ వైఫల్యాన్ని మూటగట్టుకుంది’ అని స్పష్టం చేసింది. అస్సాం రైఫిల్స్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి తమ పోలీసుల్ని అనుమతించడం ద్వారా మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వం ఈ దుర్మార్గానికి నిశ్శబ్దంగా మద్దతు ఇచ్చిందని నివేదిక పేర్కొంది. ఈ వివాదం, ఇంటర్‌నెట్‌పై నిషేధంతో రాష్ట్రంలో ఒక చోట ఏం జరుగుతుందో.. మరో చోట తెలియకుండా పోయిందని తెలిపింది. దేశంలో పురాతనమైన పారామిలటరీ బలగాలు అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులకు మధ్య వివాదం దేశంలోనే తొలిసారని నివేదిక తెలిపింది. అస్సాం రైఫిల్స్‌కు వ్యతిరేకంగా మణిపూర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ‘కుకీ మిలిటెంట్లు పారిపోవడానికి అనుమతించారు’ అని స్పష్టంగా ఉంది. ఈ నెల 1న అస్సాం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పిసి నాయర్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో లాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తమకు ఎదురుకాలేదని చెప్పారు.ఇంటర్‌నెట్‌ నిషేధంతో వార్తల క్రాస్‌-చెకింగ్‌, మానిటరింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక తెలిపింది. మే 3న మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌పై తొలిసారి నిషేధం విధించారు. ఆ తరువాత దానిని పొడిగిస్తూ వచ్చారు. ఇంటర్‌నెట్‌ నిషేధంతో జర్నలిస్టులు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వార్తలనే అనుసరించాల్సి వచ్చిందని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన మెయితీల పక్షం వహించాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. ప్రభుత్వం ద్వారా సమాచారంపై దిగ్బంధనం రాష్ట్రంలో జర్నలిజంపై హానికరమైన ప్రభావం చూపిందని విమర్శించింది. హింసాకాండ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మెయితీ గ్రూపునకు పక్షపాతిగా మారిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా తన విధిని నిర్వర్తించడంలో బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది.