ఇంటర్‌నెట్‌ ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు !

 కేఎఫ్‌ఓఎన్‌ ప్రాజెక్టు ప్రారంభించిన పినరయి విజయన్‌
 20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్‌నెట్‌
తిరువనంతపురం : దేశంలో ఇంటర్‌నెట్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ సోమవారం ప్రతిష్టాత్మకమైన కెఎఫ్‌ఒఎన్‌ (కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌) ప్రాజెక్టును ప్రారంభించింది. డిజిటల్‌పరంగా గల తేడాలను రూపుమాపి, రాష్ట్రం లోని దారిద్య్ర రేఖకు దిగువున గల కుటుంబాలన్నిం టికీ ఉచితంగా ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కల్పించేం దుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. దేశంలో సామాజిక, రాజకీయ అభివృద్ధికి కేరళ రాష్ట్రం ఇప్పటికే ఒక ప్రామాణికతను నిర్దేశించింది. తాజాగా దేశ డిజిటల్‌ పరివర్తనలో కూడా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 30వేలకు పైగా ప్రభుత్వ సంస్థలకు విశ్వసనీయమైన, భద్రతతో కూడిన ఇంటర్‌నెట్‌ అనుసంథానతను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా వుంది. పరిమితి లేని కమ్యూని కేషన్‌ సౌకర్యాలు అందించడం, ఈ-ప్రభుత్వ సేవల ను మరింత సమర్ధవంతంగా అందచేయగలగడం కూడా లక్ష్యాలుగా వున్నాయి. ఇది కాకుండా అదనంగా, ఆర్థికంగా వెనుకబడిన దాదాపు 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇంటర్‌నెట్‌ సదుపా యాన్ని అందజేయడమే కాకుండా, అవసరమైన డిజిటల్‌ సాధనాలతో, అవకాశాలతో వారికి సాధికారతను కెఎఫ్‌ఒఎన్‌ కల్పిస్తోంది.
ప్రజల కలల సాకారం :సీఎం విజయన్‌
ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రసంగించారు. కెఎఫ్‌ఒఎన్‌ ప్రారంభంతో ఎన్నాళ్లగానో ప్రజలు కన్న కల నెరవేరిందని, పైగా ఎల్‌డీఎఫ్‌ ఇచ్చిన హామీ సాకారమైందని తెలిపారు. బాధ్యతాయుతమైన పాలనకు ఇది మరొక ఉదాహరణ అని వ్యాఖ్యానిం చారు. అన్ని కుటుంబాలకు, ప్రభుత్వ కార్యాలయా లకు బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ అందడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువున గల 20లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్‌నెట్‌ సదు పాయం అందుతుందని, మిగిలినవారికి సబ్సిడీ రేట్లకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 17,412 ప్రభుత్వ కార్యాలయాలకు, 2105 ఇళ్లకు ఇంటర్‌నెట్‌ ఇచ్చారు. కోవిడ్‌ అనంతర కాలంలో కొత్త రకమైన పని సంస్కృతి ఆవిర్భ వించిందని విజయన్‌ పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేయడం, ఇంటికి సమీపంలో పని చేయడం, ఇంటికి దూరంగా పని చేయడం వంటి వర్కింగ్‌ పద్ధతులు సర్వసాధారణ మయ్యాయి. మన యువత ఇంటర్‌నెట్‌ నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే దేశంలో ప్రతిచోటా మరింత మెరుగైన ఇంటర్‌నెట్‌ సేవలు అందాలని అన్నారు. దీనికి కేఎఫ్‌ఓఎన్‌ ప్రాజెక్టు మంచి పరిష్కారమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.