– మాజీ డైరెక్టర్‌తో సహా పలువురిని ప్రశ్నించిన ఈడీ
– ఇదివరకే కొందరి ఆస్తుల జప్తు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
కోట్లాది రూపాయల ఈఎస్‌ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణితో సహా పలువురిని బుధవారం ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయమే మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మితో పాటు ఈఎస్‌ఐ-ఐఎంఎస్‌కు మందులు(డ్రగ్స్) సరఫరా చేసే పలు కంపెనీల యజమానులను కూడా పిలిచి ఈడీ విచారణ జరిపింది. 2015 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఈఎస్‌ఐ-ఐఎంఎస్ విభాగంలో చోటు చేసుకున్న వందదల కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు, మందులు కొనుగోలు, సరఫరాకు సంబంధించి జరిగిన కుంభకోణాన్ని రాష్ట్ర ఏసీబీ అధికారులు వెలికి తీశారు. ఈ సందర్భంగా అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మితో సహా పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అదే విధంగా, ఐఎంఎస్‌కు వైద్య పరికరాలు, మందులను సరఫరా చేసిన ప్రముఖ కంపెనీల ఎండీలతో పాటు యజమానులను, ఎండీలను, ఫార్మసీ కంపెనీ ఉద్యోగులను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నించారు. ఐఎంఎస్‌కు మందుల సరఫరాలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలు, కాగితాల పైనే కోట్లాది రూపాయల మందుల సరఫరా జరిగినట్టు చూపించి మోసం చేయటం, ఐఎంఎస్ ఆధ్వర్యాన సాగే వివిధ క్లినిక్‌లలో సైతం లక్షల రూపాయల్లో మందుల సరఫరా అయినట్టు, తర్వాత అవి వినియోగం చేసినట్టు కాగితాలను సృష్టించటం, తద్వారా వచ్చిన కోట్లాది రూపాయల డబ్బులను డైరెక్టర్ మొదలుకొని కొన్ని ఫార్మసీ కంపెనీల యజమానులు నొక్కేయటం వంటి కుట్రలు ఆ సమయంలో ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూశాయి.
అయితే, ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ కూడా జరిగినట్టు కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో భాగం ఉందంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, మరో ఓఎస్డీ ముకుందరెడ్డిలను ఈడీ అరెస్టు చేసి విచారించింది. అనంతరం ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి మొదలుకొని పలువురు అధికారులను కూడా అరెస్టు చేసింది. ఆ సమయంలోనే దేవికారాణితో పాటు పలువురు అధికారులు, కొన్ని ఫార్మసీ కంపెనీల యజమానుల కోట్ల రూపాయల ఆస్థులను జప్తు చేసింది. తాజాగా, ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు, మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ, మాజీ ఫార్మసిస్ట్ నాగలక్ష్మితో సహా పలువురు ఫార్మసీ కంపెనీల యజమానులను పిలిచి విచారించారు. ముఖ్యంగా, విదేశాలకు భారీ మొత్తంలో డబ్బులను పంపించి మనీ లాండరింగ్ పాల్పడ్డారనే కోణంలో విచారణ జరిపినట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తును ముందుకు సాగిస్తూ మరికొందరు ఐఎంఎస్‌కు చెందిన అధికారులను కూడా ఈడీ అధికారులు పిలిచి విచారించే అవకాశం ఉన్నది.