రాజనాల బండ కథల సంపుటి,
రచన : ఆర్.సికృష్ణస్వామి రాజు,
వెల : 200/-, ప్రతులకు : ఆర్‌సి.కృష్ణస్వామిరాజు,
ఫోన్ : 9393662881.
ఒక మంచి కథకు నిర్వచనం, వివరిస్తోన్న సంఘటనలు సహజంగా ఉండాలి. ఒక్కోచోట పాఠకుడు తన అనుభవాన్నే కథలో చూడగలగాలి. చదువుతున్నంతసేపూ మనసు ఉల్లాసంగా ఉండాలి. పెదవులపై చిరునవ్వు లాస్యం చేయాలి. భాష, యాసలు, సామెతలు, పోలికలు పాఠకుడి చుట్టూ చోటు చేసుకున్నవే అయి వుండాలి. చదివి పక్కన పడేసిన కొన్నాళ్లకు ఈ కథ ప్రస్తావనకు వస్తే అవును, బాగా రాశాడు అనుకోగలగాలి. ఎత్తుగడ, కథ, కథనం, ముగింపు… అన్నీ అతి సహజంగా సాగిపోవాలి. ఈ నాల్గింటిలో కథనం ఓ ప్రత్యేకత కలిగి వుండాలి.
ఇన్ని ప్రత్యేకతల్లో వర్థమాన కథా రచియత ఆర్.సి.కృష్ణ స్వామి రాజు విరివిగా కథలు రాస్తున్నారు. తిరుపతి ప్రాంతానికి చెందిన ప్రత్యేక భాష, యాసలతో కథలకు ప్రత్యేకత చేకూర్చుతున్నారు. కథ సామాన్యమే అయినా కథనం ‘అసామాన్యం’ అనిపించుకుంటున్నారు.
ప్రస్తుత కథల సంపుటి ‘రాజనాల బండ’ రాజు వెలువరించిన పదకొండవది. ఇందులో 20 కథలున్నాయి. ఇవన్నీ లోగడ పలు అంతర్జాల, ముద్రిత పత్రికల్లో ప్రచురించబడి, ప్రజాదరణ చూరగొన్నవే అవడం విశేషం. తుమ్మల చెరువు కండ్రిగ, డేరా కండ్రిగ, కార్వేటి నగరం, పుత్తూరు, రాసపల్లి, రాయల చెరువు లాంటి పల్లెల్లో నాగరికత సోకి నగరాలుగా మారుతున్న నగరి, చంద్రగిరి లాంటి టవున్లలో కథ నడిపిస్తూ స్థానికత కల్పిస్తున్నారు. తడికమీద ఆరేసిన గుడ్డలు, గాలికి ఎగురుకుంటూ బావిలో పడటం, ద్రౌపదమ్మ తిరునాళ్లు, పుత్తూరికి సినీనటి హలం రాక, సూర్యగ్రహణం లాంటి మామూలు సంఘటనలకు తన ఊహాశక్తి, కల్పనా చాతుర్యం జోడించి, మంచి కథలల్లుతున్నారు. పైన చెప్పినట్లు రాజుగారి కథల్లోని కథనం వీరి ట్రంప్‌కార్డు విడవక చదివిస్తుంది. ఆహార్యంతో దేహానికి మెరుగులద్దినట్లుంటుంది. ‘తిరుత్తణి మేళం జట్టు డప్పు వాయిస్తోంది. పసుపు నీళ్లలో అద్దిన పంచె, బనియను వేసి వున్నారు. అగ్గితొక్కేటోళ్లు, వేపమండలు చేత పట్టుకుని ముఖానికి కాళ్ళకు గురవాయూరు గంధం, కంచి కుండను… ఎడం చేతికి గుండు మల్లెలు, కుడి చేతికి అగ్గి కంకణం, మెడలో తురక చామంతుల మాల వేసినారు’ (మావా! సుందరం మావా! కథ). తిరునాళ్లలో గుండం తొక్కడం మన కళ్లముందే జరుగుతున్నట్లుంటుంది.
ఉల్లాసంగా నల్లేరు మీది నడకలా సాగే ఈ కథల్లోని వాడుక మాటల్ని సామెతలు సహజంగా కథల్లో ఇమిడి పోతాయే తప్ప ఎబ్బెట్టు, అనవసరం అనిపించవు. ‘నాకే లేదు నాకుడు బెల్లం, మీకు ఎక్కడి నుంచి తెచ్చేది గోకుడు బెల్లం’, అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బ’ (దెబ్బ కనిపించదు కానీ, చేయి కదిలించినప్పుడల్లా సలుపుతుంది). ఈనిన మేక మాదిరి అల్లాడతా వుండడం, నోటితోనే గానుగ ఆడించడం (అస్తమానం ఏదో ఓటి తింటూవుండడం), తిక్కలోడు తిపతికి పోతే ఎక్కాదిగా ఏడేళ్ళు పట్టడం, ఒళ్ళంతా స్పింగు మింగినోడి లెక్కన వయ్యారాలు పోవడం, కొంగు ఇంగువు, జాంజాం మని కొట్టడం, డుర్రుడుర్రుమని గుడుగుడు మోటర్ సౌండు చేయడం, పడీ పడీ చదవడం లాంటి వర్ణన/ పదాల, సామెతల వాడుక ఈ రచయిత ప్రత్యేకత అందుకే ఈ కథలన్నీ మళ్లీ మళ్లీ తడమాలనిపిస్తాయి. పాతతరం వారితో నెమరు వేయిస్తాయి. ఈనాటి తరానికి ఆనాటి సంగతులు తెలియజెపుతాయి హృద్యంగా! అందంగా!
– కూర చిదంబరం, 8639338675