మహిళా రిజర్వేషన్‌ బిల్లు

అమ్మ నాన్న సమానమని
నాన్నొక్కడే వెలిగిపోతెట్ల
అమ్మకూడ అసెంబ్లీలో అడుగుపెట్టాలి
అక్కాచెల్లెళ్లు పార్లమెంటు నేలాలి
చట్టాలకు శస్త్ర చికిత్స జరుగాలి

ఆడబిడ్డ కూరాడుతోనే
గహప్రవేశం జరిగినప్పుడు
అక్క అవిరేనుతోనే
లగ్గానికీ మంగళనాదం మోగినప్పుడు
చెల్లెల్ల రాఖీలతోనే
అన్నాతమ్ముల సంతోషాలు అలుగెల్లినప్పుడు
రాజకీయ దేవాలయంలో అమ్మలకు సంకేళ్లా?

కంట్లో వెలుగున్నప్పుడు
ఇంట్లో వెలుగుండాలి
ఊరు నగరం కాంతులీనుతున్నప్పుడు
వాడలో గూడాలలో గుడిసెలలో వెలుగుండాలి
మహిళా న్యాయం పున్నమి వెలుగై నవ్వాలి

భారత స్వాతంత్య్ర అమతోత్సవాలు వీధివీధి త్రివర్ణమై మురిసిన వేళ
స్వేచ్ఛ సమానత్వాలకు కత్తులు గీస్తెట్ల
తరతరాల అణచివేతకు స్వస్తి పలికి
అభ్యుదయానికి నారుపోయండి
మహిళా విప్లవానికి నగారా మోగించండి
ఆలోచనలు తోరణాలైతే
ఆశయాలు ఆకాశాలై నవ్వుతయి

వేటమాంసాన్ని
కుప్పలేసి సమంగా పంచుకునే సామాజిక న్యాయచరిత్ర అనాదిగా మన కండ్లముందట
నాగరికులు అసమ చట్టానికి
అన్యాయ శాస్త్రానికే ఏరువాకైతెట్ల

ఆకాశంలో సగం జనాభాలో సగం
ఆస్థులు అంతస్థులు సగం
అవకాశాలలో సమానం కావాలి
మనుషులంతా ఒకటే జాతులే వేరువేరు పీడనలు వేరువేరు
స్త్రీ జాతి, దళిత బహుజన స్త్రీ జాతి
మహిళా రిజర్వేషన్‌ బిల్లు న్యాయమైన హక్కు

పొలం చేసిన చేతులు, పొరుకలల్లిన చేతులు పురుడు పోసిన చేతులు, పూలల్లిన చేతులు
కలుపుతీసిన చేతులు, కల్లం చేతులు
అంట్లుతోమిన చేతులు, ముగ్గులేసిన చేతులు
పోరుచేసిన చేతులు, పోలు తిరిగిన చేతులు
మందారపు చేతులు మట్టిపూల చేతులు
చట్టాలను చేసే చేతులు కావాలి
చరిత్రను వెలిగించే
సావిత్రిబాయిఫూలే చేతులే చట్టాలు కావాలి

తరీఖా తీరు మారితేనే
నలుగురికి ఆదర్శంగా నాగరికత
ప్యూడల్‌ ఆలోచనలు సమాదైతేనే
ఫూలే అంబేద్కర్‌ల కలలు ఫలవంతం
సామాజిక మహిళా విప్లవం మహా అదర్శం
దళిత బహుజన వాటాతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు
సమత మమతకు అఖండ జోతి
– వనపట్ల సుబ్బయ్య, 9492765358

Spread the love