స్పెషల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు

– కానిస్టేబుల్‌ అభ్యర్థుల నిరసన
– జీవో నెంబర్‌ 46 ను రద్దు చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-వనస్థలిపురం
రాష్ట్రంలో స్పెషల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని, జీవో నెంబర్‌ 46ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం 14 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులు నిరసన తెలిపారు. హైదరాబాద్‌ వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని చింతలకుంట ప్రసారభారతి ఆకాశవాణి రేడియో టవర్‌ ఎక్కడానికి అభ్యర్థులు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నవీన్‌, కృష్ణ, లక్ష్మణ్‌, శివకుమార్‌, నాగచారితో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ అభ్యర్థులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ జిల్లాల వారీగా ఉండేదని, ఇప్పుడు మూడు జిల్లాలను ఒక జోన్‌గా ఏర్పాటు చేశారని తెలిపారు. మార్కుల ప్రతిపాదికన ఎంపిక చేయకుండా, జనాభా ప్రతిపాదికన ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీని వల్ల 100 శాతం మార్కులు తెచ్చుకున్న వివిధ సామాజిక తరగతుల అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 46ను రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలియచేయడానికే ఈ నిరసన చేపట్టినట్టు తెలిపారు.