11 లక్షల ఎకరాలకూ ఒకే విడతలో పోడు హక్కులివ్వాలి

తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని మొత్తం 11లక్షల ఎకరాల పోడు భూము లకు ఒకే విడతలో హక్కు పత్రాలివ్వాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్‌) డిమాండ్‌ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో పోరాటాల పలితంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. జూన్‌ 24 నుచి 30 వరకు హక్కుపత్రాలు పంపిణీ చేయనున్న నేపథ్యం లో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వాటిని పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి హజరై ప్రసంగించారు. ‘గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు సుదీర్ఘకాలం చేసిన పోరాటాల ఫలితంగానే పోడు భుము లకు హక్కుపత్రాలు అందించేందుకు ప్రభుత్వం ముందు కొచ్చింది. రైతుల పై పెట్టిన కేసులన్నింటిని బేషరతుగా ఎత్తివేయాలి. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే 11 లక్షల ఎకరాల పోడు భూములకు మొదటి విడతలోనే పట్టాలు పంపిణీ చేయాలి. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత మందికి మాత్రమే హక్కుపత్రా లు ఇచ్చి చేతులు దులుపు కావాలని చూస్తే మరో పోరాటానికి సిద్ధమ వుతాం’ అంటూ జూలకంటి ఈ సందర్భంగా హెచ్చరిం చారు. ఇప్పటి వరకు జిల్లాలనుంచి అందిన సమాచారం మేరకు కేవలం 4లక్షల ఏకరాలకు మాత్రమే హక్కుపత్రా లు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నదని ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌ తెలిపారు. శాటిలైట్‌ మ్యాపులను చూపెట్టి వేలాదిమంది పోడు రైతుల దరఖాస్తులను తిరస్కరించా రని ఆరోపించారు. జూన్‌ 5 నుంచి నెలరోజులపాటు పోడు భూముల ప్రాంతాల్లో పర్యటించి ఎంఆర్వో, కలెక్టర్ల కు వినతి పత్రాలు ఇవ్వాలనీ, హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొని హక్కు పత్రాలు సక్రమంగా అందే విధంగా చూడాలని పిలుపు నిచ్చారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లోనే గిరిజన బంధును ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జూన్‌ 16న రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీలో తీర్మానించినట్టు తెలిపారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై జూలైలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, నాయకులు గుగులోత్‌ ధర్మ, భూక్యా వీరభద్రం, వాంకడోత్‌ వీరన్న, కొర్ర శంకర్‌, ఎం రవి నాయక్‌, ఎం బాలు, పాండు, గన్యా, శ్రీకాంత్‌, బాల్యానాయక్‌, అశోక్‌, పార్వతి, జ్యోతి పాల్గొన్నారు.