ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాధ్యమేనా?

– విదేశీ మారక ద్రవ్య ఆదాయానికి గండి
– అదుపు తప్పనున్న ద్రవ్యోల్బణం
– కంప్యూటర్‌ పరికరాల దిగుమతులపై ఆంక్షల ప్రభావం
న్యూఢిల్లీ : కంప్యూటర్‌ పరికరాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయి. విదేశీ మారక ద్రవ్య ఆదాయానికి భారీగా గండి పడడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులు పడిపోతాయి. పోటీతత్వం బలహీనపడుతుంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ రంగంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. మొత్తంగా మోడీ ప్రవచిస్తున్న ఆత్మ నిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రచారానికే పరిమితమవుతాయి. విమర్శలు వెల్లువెత్తడంతో ఆంక్షలపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ నవంబర్‌ 1వ తేదీ నుండి ఆ ప్రమాదం పొంచి ఉంది.
ఆంక్షలు…నిరసనలు…సమర్ధింపులు
ఈ నెల మూడున ప్రభుత్వం దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్‌ కంప్యూటర్లు, సర్వర్లు వంటి పరికరాల దిగుమతులను ‘ఆంక్షల’ జాబితాలో చేర్చింది. అంటే లైసెన్స్‌ ఉంటేనే వాటి దిగుమతులను అనుమతిస్తారు. ఇందుకు కొన్ని చిన్న చిన్న మినహాయింపులు ఇచ్చినప్పటికీ అన్ని కంప్యూటర్‌ పరికరాలు తక్షణమే ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. దీనిపై వివిధ వర్గాల నుండి నిరసన వ్యక్తం కావడంతో మంత్రులు, అధికారులు వివరణలు ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నినాదమైన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు అనుగుణంగా కంప్యూటర్‌ పరికరాల తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా భద్రతా పరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఈ సమర్ధింపులు ఏవీ విమర్శల జడివానను ఆపలేకపోయాయి.
సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులలో పురోగతి
దేశంలోని కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ తయారీ పరిశ్రమ చాలా చిన్నది. సెమీ కండక్టర్‌ చిప్‌లు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, విడిభాగాల కోసం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాము. కంప్యూటర్‌ పరికరాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనకు లేదు. అవసరమైన వాటిని దిగుమతి చేసుకొని, తయారీలో ఉపయోగించుకోవడానికే పరిమితమవుతున్నాము. ఈ విషయంలో కూడా దేశీయంగా పోటీ లేదు. అయితే ప్రపంచ దేశాలు ఉత్పత్తి చేస్తున్న కంప్యూటర్‌ పరికరాలను దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించడం ద్వారా ఐటీ సేవల ఎగుమతి పరిశ్రమను పెద్ద ఎత్తున నిర్మించుకోవడంలో మాత్రం గత పాతిక సంవత్సరాలుగా విజయం సాధిస్తున్నాము. ఐటీ సాఫ్ట్‌వేర్‌ సేవలను భారీగా ఎగుమతి చేస్తున్నాము. ఆర్‌బీఐ సమాచారం ప్రకారం 2021-22లో సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతుల ద్వారా మన దేశం 122 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. కంప్యూటర్‌ పరికరాలు దిగుమతి చేసుకోవడం వల్ల అవుతున్న వ్యయంతో పోలిస్తే సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులు 10 రెట్లు అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నాయి. 2021- 22లో మన దేశం నుండి ఎగుమతి అయిన మొత్తం సేవల లో ఒక్క సాఫ్ట్‌వేర్‌ సేవలే 48% వరకూ ఉన్నాయి. వస్తువు లు, సేవల మొత్తం ఎగుమతులలో ఈ సేవల వాటా 18%.
ఇప్పుడు అదుపులోనే ఉన్నా…
దేశీయ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ పరిశ్రమ తన ఉత్పత్తుల ధరలను పెంచలేకపోతోంది. ఆంక్షలు లేని సరళీకృత దిగుమతి విధానమే దీనికి కారణం. స్వేచ్ఛా దిగుమతుల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. గత దశాబ్ద కాలంగా ఈ రంగంలో ద్రవ్యోల్బణం ఏటా 1.5%గానే ఉంటోంది.
అదే ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే ద్రవ్యోల్బణం మూడు శాతానికి పైగానే ఉంటోంది. ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉన్న రంగాలలో తోలు ఉత్పత్తుల తయారీ మొదటి స్థానంలో ఉండగా సాఫ్ట్‌వేర్‌ సేవలు రెండో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వం నిర్బంధ లైసెన్సింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగానే కంప్యూటర్‌ పరికరాలను తయారు చేసే కొందరు స్థానిక ఉత్పత్తిదారుల షేర్ల ధరలు పెరగడం ప్రారంభించాయి. బడా దిగుమతిదారుల షేర్ల ధరలూ పెరిగాయి.
మన దేశానికి దిగుమతి అవుతున్న కంప్యూటర్‌ పరికరాలలో 60% చైనాకు చెందినవే. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలో దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే ఇవి ఫలప్రదం కావడానికి చాలా కాలం పడుతుంది. అప్పటి వరకూ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇస్తేనే మంచిది.
ఏం జరుగుతుంది?
కంప్యూటర్‌ పరికరాల స్వేచ్ఛా దిగుమతు లపై ప్రతిపాదిత ఆంక్షల కారణంగా సాఫ్ట్‌వేర్‌ సేవల్లో మన పోటీతత్వం బల హీనపడుతుంది. ఫలితంగా ఆ సేవల ఎగు మతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఆర్జించి పెడుతున్న సాఫ్ట్‌వేర్‌ సేవల ఎగుమతులకు తెలిసి తెలిసి ఎందుకు నష్టం కలిగిస్తున్నామనే విషయం ప్రభుత్వానికే తెలియాలి.
ఆంక్షలు వాయిదా
ఈ నెల 4వ తేదీ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత…అంటే ఆంక్షలు విధించిన మరునాడు…ప్రభుత్వం తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గింది. దిగుమతి చేసుకునే పరికరాలకు విధిగా లైసెన్స్‌ ఉండాలన్న నిబంధన అమలును నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది. ఏ విధమైన లైసెన్స్‌ లేకపోయినా అక్టోబర్‌ 31 వరకూ దిగుమతులను అనుమతిస్తామని ప్రకటించింది. ఏది ఏమైనా ఒకప్పటి లైసెన్స్‌ రాజ్‌ను ‘డిజిటలీకరణ’ పేరిట తిరిగి పట్టాల పైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కంప్యూటర్‌ పరికరాల దిగుమతిలో లైసెన్స్‌ రాజ్‌ను ప్రవేశపెట్టడం వల్ల భారత్‌ను ఆత్మ నిర్భర దేశంగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందా? దేశ భద్రతా ప్రయోజనాలు పరిరక్షించబడతాయా?