తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇదేనా బహుమతి

– మాపై ఉపా కేసు నమోదు అప్రజాస్వామికం
– 146 మందిపైనా ఆ కేసును ఎత్తేయాలి
– ఉపా చట్టాన్ని రద్దు చేయాలంటూ తీర్మానం చేయాలి : పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను. సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్‌ మార్చ్‌, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నాను. టీజేఏసీలో కీలకంగా పనిచేశాను. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తాడ్వాయి పోలీసులు నాపై ఉపా కేసును నమోదు చేశారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా?’అని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి సంధ్య ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉపా కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇది అప్రజాస్వామికమని ఆమె విమర్శించారు. మావోయిస్టులకు తమకు ఏం సంబంధమని ప్రశ్నించారు. మావోయిస్టుల డైరీలో పేర్లు ఉన్నంత మాత్రాన ఉపా కేసును నమోదు చేస్తారా?అని నిలదీశారు. వారిలో డైరీలో సినీనటుల పేర్లు, హీరోయిన్ల పేర్లు ఉంటే వారిపైనా కేసులు పెడతారా?అని ప్రశ్నించారు. 152 మందిపై తాడ్వాయి పోలీసులు గతేడాది ఆగస్టు 19న ఉపా కేసును నమోదు చేశారని చెప్పారు. సరైన ఆధారాల్లేవనే కారణంతో హరగోపాల్‌, పద్మజాషా, రఘునాథ్‌, గడ్డం లక్ష్మణ్‌, గుంటి రవి, సురేష్‌పై కేసులను ఎత్తేశారని వివరించారు. మిగిలిన 146 మందిపైనా ఆ కేసును ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నియంతృత్వాన్ని, ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్‌ తమపై ఉపా కేసును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సచివాలయం, అంబేద్కర్‌ విగ్రహం కాదనీ, విద్యావైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని చెప్పారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సుభద్ర, ఉపాధ్యక్షులు ఎం సరళ, సహాయ కార్యదర్శి ఊకే పద్మ, కార్యవర్గ సభ్యులు జి అనురాధ మాట్లాడుతూ హరగోపాల్‌, సంధ్య, కాశీం, పద్మజాషా, విమలక్క, మోహన్‌ బైరాగి, రఘునాథ్‌, గడ్డం లక్ష్మణ్‌, చిక్కుడు ప్రభాకర్‌, బల్లా రవీంద్రనాథ్‌, సావిత్రి, జ్యోతి, దేవేంద్ర, శిల్పతోపాటు మొత్తం 152 మందిపై ఉపా కేసు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది కుట్ర కేసు అని అన్నారు. ములుగు జిల్లా పస్రా పోలీసులు అక్రమంగా బనాయించిన ఈ తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మోడీపై కేసీఆర్‌ చేస్తున్న యుద్ధం నిజమైతే ఉపా కేసును ఎత్తేయాలని కోరారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆగబోయిన నర్సక్క, కార్యవర్గ సభ్యులు జి భారతి, కె రాములమ్మ, జె ఐలమ్మ, బి శారద, ఎం మనీషా, పి లక్ష్మి పాల్గొన్నారు.
హోంమంత్రికి న్యూడెమోక్రసీ వినతి
ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తరహాలోనే పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి సంధ్య తదితరులపై ఉన్న తాడ్వాయి కుట్ర కేసును ఎత్తేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో హోం మంత్రి మహ మూద్‌ అలీని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, నాయకులు కె గోవర్ధన్‌, ఎం శ్రీనివాస్‌, వి సంధ్య, ఆరెల్లి కృష్ణ, జి అనురాధ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కేసు గురించి డీజీపీతో మాట్లాడతానని హోంమంత్రి హామీనిచ్చారని తెలిపారు.