సమస్యలు పరిష్కరించకుంటే సమరమే..

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీల రాష్ట్ర జీపుజాతా ప్రారంభం
నవతెలంగాణ-ఆదిలాబాద్‌అర్బన్‌
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమరం తప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పీఆర్‌టీయూ భవనంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కార్యక్రమంలో భాస్కర్‌ పాల్గొన్నారు. అలాగే, అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న రాష్ట్ర జీపు జాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ను బలోపేతం చేయడంతోపాటు అంగన్వాడీలను ఉద్యోగులుగా గుర్తించి.. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా అంగన్వాడీల సమస్యలలో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్‌లో కోతలు విధిస్తూ అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే దిశగా విధానాలను రూపొందిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కా భవనాలు, పోషకాహార సెంటర్‌ గదులు, మెనూ చార్జీలు, ఖాళీ పోస్టులు, పెండింగ్‌ టీఏ, డీఏ లాంటివి లేకపోవడంతో అంగన్వాడీ ఉద్యోగులు సతమతమవుతున్నారని చెప్పారు. ఇది సరిపోదన్నట్టు ప్రభుత్వాలు ఐసీడీఎస్‌యేతర పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, బీఎల్‌ఓ డ్యూటీలు తదితర అదనపు పనులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ.. చిన్న పిల్లలకు ప్రీస్కూల్‌ పాఠాలను బోధిస్తూ.. ఆరోగ్యభారతాన్ని నిర్మిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ, పీఎఫ్‌, ఇన్సూరెన్స్‌ లాంటి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌.. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పెన్షన్‌ ఉద్యోగ భద్రతలాంటి సౌకర్యాలు కల్పించాలని తీర్మానం చేసినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అంగన్వాడీలు 1972 చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు వర్తింపచేయడం లేదని అన్నారు.
కేంద్రం 29 కార్మిక చట్టాలను కూడా రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ, రాష్ట్ర కోశాధికారి కె.సునీత, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, రాష్ట్ర నాయకులు సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.వెంకటమ్మ, నాయకులు డి. సునీత, పి.రత్నమాల, సుభద్ర, మధునిక, కళ, పంచశీల, పంచపూల, ఖుషి వర్త కళ్యాణి, సంగీత తదితరులు పాల్గొన్నారు.