విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘటన కేసీఆర్‌దే

– విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
– నవతెలంగాణ-షాద్‌నగర్‌
విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని, కేజీ నుంచి పీజీ వరకూ విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గంలోని కాశిరెడ్డిగూడ, లింగారెడ్డిగూడ, రాయికల్‌ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రతి విద్యార్థికి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. నాణ్యమైన విద్యతోపాటు సన్న బియ్యంతో కూడిన పౌష్టిక భోజనాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్థాయిలో రూపుదిద్దు కున్నాయన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 149 పాఠశాలల్లో 22.2 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో విద్యాభివద్ధికి కషి చేస్తున్నామని, నియోజకవర్గంలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కమ్మదనం మహిళా గురుకులం, మొగిలిగిద్ద బాలికల బీసీ గురుకులం, నాగులపల్లి మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల స్కూల్‌, గిరిజన మహిళా డిగ్రీ కళాశాల, కొందుర్గులో ఎస్సీ బాలుర గురుకులం, చౌదర్‌గూడలో బీసీ బాలుర గురుకులం, కొత్తూరులో గిరిజన బాలుల పాఠశాల, మొగిలిగిద్ద కస్తూర్బా, కొందర్గు కస్తూర్బా, లాల్‌ పహాడ్‌ కస్తూర్బా, పాటిగడ్డ కస్తూర్బా, కొత్తూరు కస్తూర్బా పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యా అభ్యున్నతికి అహర్నిశలు కషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారని అన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని తమ ఉజ్వల భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణయ్య, జడ్పిటిసి వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇంద్రిస్‌, జడ్పి వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, ఎంపిడిఓ వినరు కుమార్‌, ఆశన్న గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.