– టీఎస్‌పీఈఏ కన్వీనర్ రత్నాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో విద్యుత్‌రంగ ప్రయివేటీకరణను ఉద్యోగుల సంఘటిత ఆందోళనలే నిలుపుదల చేశాయని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) కన్వీనర్ పీ రత్నాకరరావు అన్నారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్‌సీసీఓఈఈఈ) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారంనాడిక్కడి తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయం ఎదుట ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యుత్ ఉద్యోగుల మెడపై ప్రయివేటీకరణ కత్తి వేలాడుతూనే ఉందనీ, ఎప్పటికప్పుడు దాన్ని సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కో-చైర్మెన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రయివేటీకరణ బిల్లును ఆపకపోతే ఉద్యోగ భద్రత ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ఆందోళనల ద్వారా నిరసనలు తెలపాలన్నారు. కో కన్వీనర్ బీసీ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా ఆపాలంటే ఉద్యమాలే శరణ్యమన్నారు. 1104 యూనియన్ నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును ఆపేందుకు కార్మిక లోకం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో వెంకన్న (బీసీ అసోసియేషన్), సుధాకర్ రెడ్డి (ఓసీ అసోసియేషన్), రాంజీ (ఎస్టీ అసోసియేషన్), ఈశ్వర్ గౌడ్ (అకౌంట్స్ అసోసియేషన్), జ్యోతి రాణి (ఉమెన్స్ అసోసియేషన్) తదితరులు పాల్గొన్నారు.