జేఏసీ అవశ్యం

టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం..26న మళ్లీ భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడటం అవశ్యమని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎమ్‌యూ నాయకులు ఈ అశ్వత్థామరెడ్డి అధ్యక్షతన కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. గోపాల్‌ (టీజేఎమ్‌యూ), పీ రవీందర్‌రెడ్డి (ఎస్‌డబ్ల్యూఎఫ్‌), పీ కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), సాంబయ్య (కార్మిక సంఫ్‌), పీ హరికిషన్‌ (ఎస్‌టీఎమ్‌యూ), సుద్దాల సురేష్‌ (బీకేయూ), జీ అబ్రహం (బీడబ్ల్యూయూ), ఎర్ర స్వామికుమార్‌ (ఎస్‌డబ్ల్యూయూ), జీకే స్వామి (ఎంప్లాయీస్‌ యూనియన్‌) పాల్గొన్నారు. కార్మిక పరిషత్‌కూడా సమావేశం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిందని నేతలు తెలిపారు. జేఏసీ ఏర్పాటు తప్పనిసరి అనీ, కార్మికుల పక్షాన పోరాటం అనివార్యమని సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని, అవసరమైతే అందరు యూనియన్‌ నాయకులు కలిసి అన్ని పార్టీల సహకారం తీసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించు కోవాలని నిర్ణయించారు. దీనిపై తదుపరి నిర్ణయం కోసం ఈనెల 26న మరోసారి అన్ని సంఘాల ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడే తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని నిర్ణయించారు.