జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

నవతెలంగాణ-సిటీబ్యూరో
జైపూర్‌-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాద్‌ వాసి సయ్యద్‌ సైఫుద్దీన్‌ భార్య అంజుమ్‌ షాహీనకు రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించింది. కులీ కుతుబ్‌ షా పట్టణాభివృద్ధి సంస్థలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమిస్తూ ఆ సంస్థ పరిపాలనాధికారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జియాగూడలో డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, ఆసరా పథకం కింద వితంతు పింఛన్‌ను మంజూరు చేస్తూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి జీవో విడుదల చేశారు.
అదేవిధంగా నగరంలోని దారుస్సలాంలో మజ్లిస్‌ పార్టీ పక్షాన మృతుడి ముగ్గురు కుమార్తెల పేరిట రూ.1లక్ష చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు చెక్కులను బాధిత కుటుంబానికి ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అందించారు. మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్ధీన్‌ ఓవైసీ అసెంబ్లీలో ప్రస్తావించడంతో సర్కారు స్పందించి ఈ మేరకు ఉద్యోగం, ఇల్లు, పెన్షన్‌ ఆదేశాలు జారీ చేసింది.