– రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్
నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్రంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ తక్షణమే కేటాయించాలని తెలంగాణ ప్రజాసంఘాలు పోరాట వేదిక ఆధ్వర్యంలో 18నుండి 27 వరకు రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రను జయప్రదం చేయాలనీ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పట్టణంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న పేదవాడికి సొంత ఇల్లు లేకపోవడం పేద ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి చేతినిండా పనులు దొరక్క అద్దె ఇళ్ళలో ఉంటూ అనేక అవమానాలు భరిస్తున్నారని అన్నారు. ప్రతి పౌరుడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు కల్పించాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయాలేదని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉన్నవాళ్ళకు ఇండ్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. రూ.5 లక్షలకు పెంచి అర్హులైన పేదలందరికీ వర్తింప చేయాలని అన్నారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలం కేటాయించి నిర్మాణం వ్యయం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 61 కేంద్రాల్లో, 48 వేల మంది పేదలు ఇండ్లు వేసుకొని నివాసముంటున్న వారినందరినీ అర్హులుగా గుర్తించాలని కోరారు. జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు క్రమబద్ధీకరణ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. 2020 కంటే ముందే ఇల్లు కట్టుకొని ఉండాలనే నిబంధనలతో పాటు లబ్ధిదారుల పేరు మీద ఏదైనా ఒక ఆధారం ఉండాలనే తిరకాసు పెట్టిందని అన్నారు. ఫలితంగా ప్రస్తుతం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు ఈ జీవో ప్రకారం పట్టాలు పొందే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలు, ఇతర కార్పొరేటు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటున్నదని అన్నారు. ప్రభుత్వ జీవోల్లో ఉన్న అస్పష్ట నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. గుడెసెలు వేసుకున్న పేదలను తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి, అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూముల్లో పక్కా ఇండ్లు నిర్మాణం చేసుకున్న వారందరికీ ఇంటి పట్టాతోపాటు ఇంటి నెంబరు, కరెంటు మీటరు, వాటర్ కనెక్షన్లు, నిర్మాణంతో పాటు, గృహ లక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్రూం సాధనకై 2023 జూన్ 18 నుండి 27 వరకు జరిగే బస్సు యాత్రను ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు చింతమల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరబోయిన కుమారస్వామి, వృత్తి సంఘాల జిల్లా నాయకులు ముంజాల సాయిలు, కేవీపీస్ జిల్లా అధ్యక్షులు హన్మకొండ ఆనందం, మహిళా సంఘం జిల్లా నాయకురాలు వజ్జంతి విజయ,ప్రజా సంఘాల నాయకులు నమిండ్ల స్వామి, ఈదునూరి వెంకన్న,బోళ్ల సాంబయ్య,యాకుబ్, హన్మకొండ సంజీవ,గడ్డమీది బాలకృష్ణ, మొగులోజు శారదా, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కమతం వెంకన్న, పెండ్యాల సారయ్య,sk అన్వర్, ఫరిదా, నాగమణి స్వప్న,ప్రవళిక కార్తీక్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.