– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ఇష్టపూర్తిగానే బీఆర్‌ఎస్‌ను వీడాం
– కార్పొరేటర్ విజయనిర్మల దంపతులు
– ఇంకా చాలా మంది వీడతారు: మాజీ ఎమ్మెల్సీ బాలసాని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌పై విశ్వాసంతోనే భారీగా పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్ పాకాలపాటి విజయనిర్మల- శేషగిరి దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా బైపాస్‌రోడ్డులోని తుమ్మల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పై విశ్వాసంతోనే విజయనిర్మల దంపతులు పార్టీలో చేరారన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. పాకాలపాటి దంపతులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా, న్యాయంగా వ్యవహరించాలన్నారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇష్టపూర్తిగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కార్పొరేటర్ దంపతులు ప్రకటించారు.
ఇంకా బీఆర్‌ఎస్‌ను వీడతారు: బాలసాని
ఇంకా అనేక మంది బీఆర్‌ఎస్‌ను వీడతారని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. బందిపోట్లు, రౌడీషీటర్ల మాదగ్గర ఎవరున్నారో చూపాలని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్‌ఎస్ నేతలు పెట్టిన కేసులే తమ పార్టీ నాయకులపై ఉన్నాయన్నారు. ఏం మాట..ఏం భాష మాట్లాడుతున్నారు..? ఇంకా ఎన్నిరోజులో మీ బెదిరింపులు సాగవన్నారు. నెల రోజుల్లో మీ బెదిరింపులకు చెల్లుచీటి తప్పదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు. ఆనాడు తనపై పోటీ చేసిన పువ్వాడ నాగేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం వంటి నేతలు ఏనాడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదన్నారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేస్తారు…మీ నాయకుడు కేసీఆర్ కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్, ఇప్పుడు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఇంకా చాలామంది బీఆర్‌ఎస్‌ను వీడతారని, అదీ నువ్వు ఖమ్మంలో ఉన్నప్పుడే జరుగుతుందని పువ్వాడ అజరుకు సవాల్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావీద్, కార్పొరేటర్ కమర్తపు మురళి, మాజీ కార్పొరేటర్ చావా నారాయణరావు, నాయకులు సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.