– పుల్లయ్య నామినేషన్ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు
– ఉత్తేజం నింపిన బివి రాఘవులు, తమ్మినేని ఉపన్యాసాలు
– ఆకట్టుకున్న డోలు, కోయ నృత్యాలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం ఎవరినో గెలిపించ డానికి మరెవరినో ఓడించడానికి ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ చేయడం లేదని కేవలం తెలంగాణ అసెంబ్లీలో ఎర్రజెం డాను పంపడం కోసమే భద్రాద్రి గడ్డపై తిరిగి ఎర్రజెండాను రెపరెపలాడించడం కోసమే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన ఉపన్యాసంతో కార్యకర్తలలో నూతన ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగి ఎన్నికల సమరంలో ఎర్రజెండా సత్తా చాటాలని కార్యకర్తలు నయా జోష్‌తో భద్రాచలం పట్టణంలో భారీగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల పొత్తులో భాగంగా భద్రాచలం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సీటు త్యాగం చేయాల్సి వస్తుందేమోనని నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు భద్రాద్రి గడ్డపై ఎర్రజెండా పోటీ చేసి తీరుతుందని పొత్తులు ఎత్తులు ఉన్నా లేకున్నా భద్రాచలం ఏజెన్సీలో ఎర్రజెండా ఎప్పటికీ రెపరెపలాడుతుందని చాటి చెప్పే విధంగా ఆ పార్టీ నాయకత్వం ఎన్నికల సమర శంఖారావం మోగించారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య నామినేషన్ ర్యాలీకి పట్టణంతో పాటు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు నుండి భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. మార్కెట్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ అనంతపురం పట్టణ పురవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అగ్రభాగాన పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య, మాజీ ఎంపీ డాక్టర్ మీడియా బాబురావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, వంటి అగ్రనాయకత్వం ప్రదర్శనలు ముందు భాగంలో ఉండి నడిపించారు. పార్టీకి పట్టుకొమ్మలా ఉండే డోలు కొయ్య నృత్యాలు, గిరిజన కళావృత్యాలు, తీన్మార్ డ్యాన్స్‌లతో, కార్యకర్తలు ఉత్సాహంగా పట్టణ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అరుణ పతాకాన్ని చేతపట్టి సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి అంటూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎన్నికల పొత్తుల చర్చలో భాగంగా అభ్యర్థిని ప్రకటించడంలో కొంత ఆలస్యం అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ శక్తి వంచన లేకుండా కృషిచేసి భారీ సంఖ్యలో నామినేషన్ ర్యాలీకి కార్యకర్తను తరలించింది. ఆ పార్టీ నాయకులు ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు పార్టీ అభిమానులు తరలిరావడంతో సభ ప్రాంగణం కూడా నిండిపోయింది. వివిధ మండలాల నుండి అధిక సంఖ్యల తరలివచ్చిన కార్యకర్తలను చూసి ఆ పార్టీ నాయకులలో కూడా గెలుపు పై ధీమా రెట్టింపైంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలలో మరోసారి భద్రాచలం గడ్డపై సీపీఐ(ఎం) తన సత్తా చాటేందుకు అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.