పీడితుల గొంతుక జాషువా

ఆనాటి సమాజంలోని జనం బాధల గాధలను గుండెలోంచి ఎలుగెత్తి చాటడం, కన్నీళ్ళను కలంలో పోసుకుని సృజించడం. సమా జపు చలనసూత్రాన్ని గ్రహించి, అసలైన అంశా లను కవిత్వీకరించి ప్రగతిశీల భావాలను ప్రజ లకు అందించినవాడే మహాకవి, ప్రజాకవి కాగ లడు. అట్లాంటి సృజనాత్మక కృషీవలుడు మహా కవి గుర్రం జాషువా. తాను స్వయానా పేదరి కాన్ని, దాని బాధను అనుభవించి, కుల వివక్ష తనూ ఎదుర్కొని సమాజ దుష్టత్వానికి ఎదురు నిలబడ్డ కలం యోధుడు ఆయన. బాధాకరమైన విషయమేమంటే జాషువా ఎదుర్కొన్న సమస్యలు, వివక్షతలూ మరింత పెరిగి సమాజాన్ని ముంచెత్తుతున్న నేటి సందర్భంలో జాషువా కవిత్వం అత్యంత సమకాలీనంగా కనపడుతూ వుంది. సంఘంలో కొనసాగిన ప్రతి జాఢ్యాన్నీ ఖండిస్తూ గొంతెత్తిన యోధుడాయన. పేదరికం, ఆకలి మొదలైన విషయాలపై ధ్వజమెత్తడం, వాటి తీవ్రతను, పర్యవసానాలను చెప్పగలగటంలో అతని ప్రగతిశీల దృక్పథాన్ని చూడగలుగుతాము.
జాషువా రచనల గురించి ప్రస్తావించగానే కేవలం కులసమస్యకు పరిమితం చేయటం సరైనది కాదు. ఈ దేశంలోని సమస్త ప్రజల ఆకలిని గురించి కూడా గానం చేశాడు. ‘ప్రతిమల పెళ్ళి చేయుటకు / వందలు వేలు వ్యయింత్రు గాని / దు:ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రికన్‌ మెతుకు విదల్చదీ భరతమేదిని / ముప్పదిమూడు కోట్ల దేవతలెగబడ్డ దేశమున / భాగ్యహీనుల క్షుత్తులారునే’ అన్నాడు. ఈ క్షుత్తులాటం ఎలా అని ప్రశ్నించాడు. ఆకలితో, దారిద్య్రంతో వున్న వారిని ఆదుకోవడం, వారి కోసం పోరాడటం కంటే గొప్ప విషయం మరోటి లేదని ప్రతి సందర్భంలోనూ ఆయన చెప్పారు. ఎవరయితే వాస్తవంగా శ్రమించి సంపద సృష్టిస్తున్నారో వారే బాధలు అనుభవిస్తున్నారనీ చెప్పగలిగాడు. ‘వాని రెక్కల కష్టంబులేని నాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు / వానికి భుక్తి లేదు’ అని అన్నాడంటే రెక్కల కష్టాన్ని ఎవరో దోచుకుని పోతున్నారనే అర్థం స్పురించడం స్పష్టంగానే వుంది. ఇది శ్రమజీవి తరుపున కవి నిలబడిన ప్రగతిశీలత. రాజకీయ విషయంలో జాషువా కవి గాంధీ సిద్ధాంతాలపై అభిమానం గలవారైనప్పటికీ, పేదవానికీ ధనవంతునికీ వున్న భేదాన్ని, అసమానతను పెంచే రాజకీయాన్ని ద్వేషించాడు. వ్యతిరేకించాడు. పేదలను, దళితులను ఏవిధంగా రాజకీయులు వంచిస్తున్నారో కూడా స్పష్టంగా తెలిసిన కవి జాషువా. ‘క్రూరుల్‌ కుత్సితులు, అస్మదీయములు హక్కుల్‌ దోచుకొన్నారు / నన్నూరింబైటకు నెట్టినారు / ఇప్పుడు నన్నోదార్చుచున్నారు’ అని చెప్పగలిగాడు. దోపిడి జరుగుతున్న తీరును అనేక సందర్భాలలో చాలా నిక్కచ్చిగా చెప్పాడు. ‘నేను చిందులాడి నేను డప్పులు కొట్టి అలసి సొలసి సత్తి కొలుపు కొలువ / ఫలితమెల్లనొరుల భాగించుకొనిపోవు / నీచమైన భూమి చూచినావె!’ అని ఈ నేలపై జరిగే తతంగాన్ని వివరించాడు. భూస్వామిక సమాజంలో దోపిడి పీడన దురహంకారం కలగలసి వుంటాయి. అలాంటి దురహంకారాన్ని, కుల పీడనను దునుమాడిన కవి జాషువా. రాజులపై కసిగా స్పందించారు. ‘పిరదౌసి’ కావ్యంలో గజనీ మహమ్మదు క్రూరత్వాన్ని ‘పదియునెనిమిది విజయరంభల వరించి / గాంగ జలమున నెత్తుటి కత్తి కడిగి’ అని ఆగ్రహాన్ని ప్రకటించాడు.
పద్య కవిగా ప్రసిద్ధుడైన జాషువా, కొన్ని పద్యాల్లో కరుణామయంగానూ, కొన్ని సామరస్యంగానూ, మరికొన్ని వేదనా భరితంగానూ ఇంకొన్ని ప్రతిఘటనతో కూడుకుని వుంటాయి. సామాజిక అసమానతలపై ఇంత ఆవేదనతో, ఆవేశంతో చెప్పిన కవి మరొకరు లేరనేది వాస్తవం. ‘నిమ్న జాతుల కన్నీటి నీరదములు / పిడుగులై దేశమును కాల్చివేయును’. ‘వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా? రుధిరమాంసములున్‌ గల అంటరాని వారాదిమవాసులు అక్కటకటా! తలపోసిన అల్ల గుండెలో సూదులు మోసులెత్తును! కృశోదరి! ఎట్లు సహించుకొందువో?’ అని ఆక్రోశించాడు పీడితుల వేదనలని. కరుణ పూరితముగా అతని కవిత కనపడినప్పటికినీ అంతర్లీనముగా ఆవేశంతో కూడిన ప్రతిఘటన కనపడుతుంది. స్త్రీల హక్కులను ఎలా హరించి వేస్తున్నారో, ఎలా సాధించుకోవాలో చెబుతూ
అబలయన్న బిరుదమటించి / కాంతల స్వీయశక్తులదిమి చిదిమినారు / సబలయన్న బిరుదు సాధించి / హక్కులు గడనచేసి కొమ్ము కష్టచరిత! అని ప్రబోధించాడు. నేడు మన దేశంలో ఏ రకమైన అలజడి చెలరేగినా, యుద్ధం జరిగినా మొదట స్త్రీ బలి పశువుగా మారుతుంది. మణిపూర్‌ తాజా ఉదాహరణ. అందుకే స్త్రీలను సంప్రదాయమనే పేర హక్కులు లేకుండా చేసి అబలను చేస్తున్న తీరును జాషువా ఆనాడే ధిక్కరించమని పిలుపునిచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి అతను ప్రజాకవని చెప్పడానికి! కవిత్వమంతా పద్యరూపంలో వున్నా, స్వేచ్ఛగా భావాన్ని కవిత్వీకరించాడు. ‘గబ్బిలం’ అని కావ్యానికి శీర్షికనెంచుకోవడంలోనే తానెవరి పక్షం వహిస్తున్నాడో ధ్వనించాడు. ఖండకావ్యాలు, ముంతాజు మహలు, పిరదౌసి, స్వప్న కథ, స్వయంవరం, క్రీస్తు చరితము, నా కథ మొదలైన ఎన్నో రచనలు మనకందించారు. తెలుగు నేల మీద హరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి పద్యాలు అందరి నోళ్ళలోనూ నానుతూనే వుంటాయి. నేటి కవులు, సృజనకారులు జాషువా రచనల నుండి స్ఫూర్తి పొందవలసినది ఎంతో వుంది. జాషువాగారన్నట్లుగానే ‘కులమతాలు గీచుకున్నగీతలజొచ్చి, పంజరానగట్టువడను నేను / నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు / తిరుగు లేదు, విశ్వనరుడనేను’ కవులు విశ్వ నరులుగా వుంటూ మానవీయతను పెంచాలి. అదే జాషువా దారి.
(జులై 24 జాషువా వర్థంతి సందర్భంగా..)
– కె.ఆనందాచారి, 9948787660