– క్యాన్సర్‌తో సీహెచ్ఎంవీ కృష్ణారావు కన్నుమూత
– రాజకీయ విశ్లేషకులుగా ప్రసిద్ధి
– విలేకరి నుంచి సంపాదకుడిగా ఎదిగిన వైనం
– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియా రంగంలోని జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ‘బాబాయి’ అని అప్యాయంగా పిలుచుకునే సీనియర్ జర్నలిస్టు సీహెచ్ఎంవీ కృష్ణారావు(64) ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించి గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన పూర్తిపేరు చిర్రావూరు వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరులో జన్మించిన ఆయన 1975లో స్ట్రింగర్‌గా జర్నలిజంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలతో పాటు డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీషు మీడియాలోనూ పనిచేశారు. ది న్యూ ఇండియా ఎక్స్ఎస్ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆయన సుధీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్‌గానూ, డీసీలో బ్యూరో చీఫ్‌గానూ పనిచేశారు. అన్ని అంశాలపైనా సమగ్ర పట్టున్న రాజకీయ విశ్లేషకులుగా పేరుపొందారు. న్యూస్ ఛానళ్లల్లో తన విశ్లేషణలతో ఆయన ప్రసిద్ధి చెందారు. 64 ఏండ్ల జీవిత ప్రస్థానంలో 47 ఏండ్లు జర్నలిజం రంగానికే ఆయన సేవలందించారు. ఆయన్ను జర్నలిస్టులు, రాజకీయ నాయకులంతా బాబాయి అని పిలిచేవారు.
అభ్యుదయ భావాలున్న వ్యక్తి కృష్ణారావు : సీఎం కేసీఆర్
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని గుర్తుచేశారు. జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
సీహెచ్ఎంవీ కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి, కమిషనర్ అశోక్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తదితరులున్నారు.