ఎంపీ రవిచంద్రను సత్కరించిన జర్నలిస్టులు

– రాజ్యసభ సభ్యుడిగా సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న రవిచంద్ర
– ఘనంగా సన్మానించిన టియుడబ్ల్యూజే (టీజేఎఫ్‌)
– కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు :ఎంపీ రవిచంద్ర
నవతెలంగాణ- ఖమ్మం
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను టీయుడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా కమిటీ ఘనంగా సన్మానించారు. రాజ్యసభకు ఎన్నికై సంవత్సర కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రవిచంద్రకు జిల్లా కమిటీ ఆత్మీయ సత్కారం చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు రవిచంద్ర మూడు దశాబ్దాలుగా పేదలకు, సమాజానికి చేసిన సేవలు, అందించిన సాయాలను గుర్తు చేశారు. రాజకీయాలలో ఇంకా రాణించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, సాయం అర్ధించిన ప్రతి కుటుంబానికి రవిచంద్ర అండగా ఉండాలని టీజేఎఫ్‌ ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి జర్నలిస్టుల నుంచి పత్రికలు, టీవీ ఛానళ్ల అధిపతులు, యజమానుల వరకు అందరితోనూ తనకు అనుబంధం ఉందని, అంతా తనకు సమానమేనన్నారు. రాజకీయాల్లో పదవులు హౌదాలు వస్తుంటాయని, అభినందన సభలు, సన్మానాలు వద్దని వారించినా కూడా పట్టుబట్టి ఒప్పించి ఇంత పెద్ద ఎత్తున సన్మానించినందుకు రుణపడి ఉంటానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా తన ఇంటి తలుపు తట్టాలని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండతో మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, జిల్లా ప్రజా ప్రతినిధులందరి చొరవ, కృషితో ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, త్వరలో సొంత ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవించాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (టీజేఎఫ్‌) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్‌, టెంజూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి శెట్టి రజినీకాంత్‌, సీనియర్‌ జర్నలిస్టులు విజేత, అమరవరపు కోటేశ్వరరావు, గుద్దేటి రమేష్‌, కొరకొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.