చనిపోతున్నాం.. న్యాయం చేయండి

– భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ – నర్మెట్ట
చనిపోతున్నాం న్యాయం చేయండి.. అంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జనగామ జిల్లా నర్మెట్టలో జరిగింది. ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… నర్మెట్ట మండలం సూర్య బండతండాకు చెందిన భార్యాభర్తలు గురు- సునీతకు సర్వే 258.లో 1.09 గుంటల భూమి ఉంది. అది సునీత పేరు మీద పట్టా ఉండగా, అదే గ్రామానికి చెందిన భూక్యా జయరామ్‌ ఆక్రమించి చదును చేస్తున్నారు. ఊరిలో పెద్ద మనుషుల్లో మాట్లాడినా బాధితులకు న్యాయం జరగలేదని మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ”చనిపోతున్నాం న్యాయం చేయండి” అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగారు. స్థానికంగా ఉన్న తండావాసులు గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ తెలిపారు.