నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్క్కతమైంది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లింక్ 3 పనులు సంపూర్ణమయ్యాయి. దీంతో రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువ మానేరుకు గోదావరి జలాలు ఎదురెక్కే సమయం ఆసన్నమైంది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పి. పెంటారెడ్డి నేతత్వంలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేస్తున్న వెట్ రన్ ప్రయత్నాలు మంగళవారం విజయవం తమయ్యాయి. అనంతరం మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. అక్కడి నుంచి సింగసముద్రం, ఆపై ఎగువ మానేరుకు జలాలు తరలనున్నాయి. లింక్ 3 ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరందనుండగా, దాదాపు 150 చెరువులను నింపనున్నారు. ఈ మేరకు సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.