రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కల్వకుంట్ల కుటుంబం

– అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, అడ్డదారిలో అనర్హుల చెంతకు
– ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారు
– గడప గడపకూ కాంగ్రెస్‌ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ కోరం
నవతెలంగాణ-ఇల్లందు
గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. మండలంలోని ఇందిరానగర్‌ గ్రామ పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీల ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడప గడపకూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం నిర్వహించి రాబోవు రోజుల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రానుందని కాంగ్రెస్‌ పార్టీతోనే నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధ్యమన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటుగా, ఐదు లక్షల రూపాయలు కేటాయింపు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా పది లక్షల రూపాయలతో మెరుగైన వైద్య సేవలు, చేయూత పథకం ద్వారా ఒంటరి మహిళకు ప్రతీనెలా నాలుగువేల రూపాయల పింఛన్‌ అందజేత, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అనసూర్య, మండల, పట్టణ అధ్యక్షులు పులి సైదులు, దొడ్డా డానియెలు, మండల ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్‌, మండల సర్పంచులు పాయం లలిత, పాయం స్వాతి, కల్తీ పద్మ, తాటి చుక్కమ్మ, ఛాట్ల భాగ్యమ్మ,ఎంపీటీసీ మండల రాము, నాయకులు జీ.వీ భద్రం, నంద కిషోర్‌, కుక్కల వెంకటేశ్వర్లు, వెంకట నారాయణ, పట్టణ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం పాల్గొన్నారు.