– ఎన్నికల సమరానికి సిద్ధమైన పార్టీ కార్యకర్తలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఉద్యమాల పురిటి గడ్డయిన భద్రాచలం నియోజవర్గం నుండి సీపీఐ(ఎం) ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయింది. పోరాటాల వారసుడిగా పిలుచుకునే స్థానిక యువకుడు కారం పుల్లయ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల పొత్తు ధర్మాన్ని విస్మరించి కమ్యూనిస్టు పార్టీలను బలహీన పరచాలన్న దురుద్దేశంతో సీట్ల సర్దుబాటులో మోసపూరితంగా వ్యవహరించిన బూర్జవ పార్టీలకు కమ్యూనిస్టు పార్టీల సత్తా చాటేందుకు సీపీఐ(ఎం) కార్యకర్తలను సిద్ధం చేసింది.
కుంజా బుజ్జి, సున్నం రాజయ్యల పోరాట వారసుడిగా ఉద్యమంలోకి వచ్చిన కారం పుల్లయ్య ఎలమంచిలి సీతారామయ్య, బండారు చందర్రావు, భీష్మారావు వంటి అమరవీరుల స్ఫూర్తితో భద్రాచలం నియోజవర్గంలో అనేక రకాల పోరాటాలలో భాగస్వామ్యం అయ్యారు. 2002లో డీవైఎఫ్‌ఐ దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా పనిచేసిన కారం పుల్లయ్య తర్వాత కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా గిరిజన సంఘం డివిజన్ కార్యదర్శితో పాటు సీపీఐ(ఎం) భద్రాచలం ఉమ్మడి డివిజన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) నియోజకవర్గ కో కన్వీనర్ బాధ్యతలతో పాటు దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాధ్యతలలో ఉన్నారు. భద్రాచలం నుండి వాజేడు మండలం వరకు గ్రామ గ్రామాన పార్టీ శాఖలతో పాటు ప్రజాసంఘాల బలమున్న మార్క్సిస్టు పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చూపించడానికి యువకుడైన కారం పుల్లయ్యను ఎన్నికల బరిలో నిలిపింది. గతంలో సీపీఐ(ఎం) తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కుంజా బుజ్జి, సున్నం రాజయ్యతోపాటు పార్లమెంటు సభ్యులుగా గెలిచిన మీడియం బాబురావులు హయాంలో జరిగిన భద్రాచల నియోజకవర్గ అభివృద్ధిని ప్రచారం చేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. పది సంవత్సరాల నుండి అధికారంలో ఉండి కూడా భద్రాచల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీకి ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి భద్రాచలం అభివృద్ధికి ఏ మాత్రం నిధులు సాధించలేని కాంగ్రెస్ పార్టీకి ఏకకాలంలో బుద్ధి చెప్పి. భవిష్యత్తులో భద్రాచలం కోసం సీపీఐ(ఎం)ని గెలిపించాలని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారని స్పష్టమవుతుంది.
కారం పుల్లయ్య ఉద్యమ నేపథ్యం
2002లో డీవైఎఫ్‌ఐ దుమ్ముగూడెం మండల బాధ్యతలు నిర్వహించిన పుల్లయ్య 2004లో ప్రజానాట్యమండలి బాధ్యతలకకు వెళ్లారు. 2007 నుండి వ్యవసాయ కార్మిక సంఘం మండల డివిజన్ బాధ్యతలలో అనేక రకాల ఉద్యమాలను నిర్వహించారు. 2009 నుండి ఆదివాసీ, గిరిజన సంఘం భద్రాచలం డివిజన్ బాధ్యతలోకి వచ్చారు. 2010లో సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన పుల్లయ్య, 2014 నుండి డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యునిగా 2019 నుండి దుమ్ముగూడెం మండల పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహిస్తూ ఆ పోరాటంలో నమోదైన కేసుల విషయంలో 16 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక రకాల ఉద్యమాలను నిర్వహించారు. గిరిజన గిరిజనేత్ర పేదలు ఎదుర్కొంటున్న స్థానిక వ్యక్తిగత సమస్యలపై అనేక రకాల పోరాటాలను పుల్లయ్య నాయకత్వంలో నిర్వహించారు. పార్టీలో ప్రస్తుత బాధ్యతలు : సీపీఐ(ఎం) దుమ్ముగూడెం మండల కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి