పట్టణాల రూపురేఖలు మార్చిన కేసీఆర్‌

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఆదిభట్లలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
పట్టణ ప్రగతిలో పరుగులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పట్టణాల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్‌దేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆదిభట్ల మన్సిపల్‌ పరిధిలోని కల్వకోల్‌ లకిëదేవమ్మ గార్డెన్‌లో జరిగిన పట్టణ ప్రగతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుపెన్నడూలేని విధంగా పట్టణ ప్రగతిలో పట్టణాలు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు సంస్థలతో ఆదిభట్ల తారా స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్‌ రాగా, తాజాగా ఫాక్స్‌కాన్‌ సంస్థ వచ్చిందన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారన్నారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఆదిభట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేయనున్నట్లుచెప్పారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో…
తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కప్పరి స్రవంతి చందు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన మున్సిపల్‌ రంగం ఎన్నో స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులను సొంతం చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో తెలంగాణ అభివృద్ధి ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి వేగంగా అడుగులు వేస్తుందన్నారు. ఒకవైపు వైద్య, విద్య మరో వైపు ప్రజలకు నాణ్యమైన మున్సిపల్‌ సేవలను చేరువ చేస్తుందని చెప్పారు. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులక రూ. 80 లక్షల చెక్కులను మహిళలకు అందజేశారు. వినూత్న పథకాలతో అన్ని ప్రాంతాలలో సకల సదుపాయాలు మెరుగుపరిచి పల్లె, పట్టణాలలో తెలంగాణను విప్లవాత్మకమైన దిశలో ముందుకు నడిపించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ఉత్తమ అధికారులుగా అవార్డులను అందజేశారు. ఆదిభట్లలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోరె కళ్లమ్మ జంగయ్య, ఆర్డీఓ వెంకటాచారి, కమిషనర్‌ అమరెందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, పాల్గొనగా, ఇబ్రహీంపట్నంలో వైస్‌ చైర్మన్‌ ఆకులు యాదగిరి, కమిషనర్‌ మమ్మద్‌ యూసఫ్‌, తహశీల్దార్‌ రామ్మోహన్‌, ఐసీడీఎస్‌ అధికారి శాంతిశ్రీ, కౌన్సిలర్లు నీలం శ్వేతా బాలు, నీళ్ల భాను గౌడ్‌, యాచారం సుజాత రవీందర్‌, నల్లబోళ్ళు మమత శ్రీనివాస్‌ రెడ్డి, అల్వాల్‌ జ్యోతి వెంక రెడ్డి,కసరమౌని పద్మ మల్లేష్‌ యాదవ్‌,కొండ్రు శ్రీలత రాంబాబు, ఆశ వర్కర్లు, ఇతర ప్రజా పతినిధులు పాల్గొన్నారు.