– లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలి
– గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చారు : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్
రెండుసార్లు గజ్వేల్ నుంచి పోటీ చేసి వందేళ్లకు సరిపడే అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ను మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో బీసీబంధు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ ఖాళీ అయిందని, బీజేపీ జాడే లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మౌలిక వసతులు సమకూర్చడంలో అన్ని వర్గాల వారికీ సమన్యాయం చేస్తుందన్నారు. గత పాలకులు చేయని సంక్షేమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో గెలవక ముందు ఒకప్పుడు గజ్వేల్ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదన్నారు. రోడ్లు సరిగా ఉండేవి కాదన్నారు. గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా కేసీఆర్ మార్చారని చెప్పారు. త్వరలో మరో వంద పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఎఫ్‌డీసీ చైర్మెన్ ప్రతాపరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.