వీఆర్‌ఏలను ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కేసీఆర్‌దే : తలసాని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో హౌంమంత్రి మహామూద్‌ అలీతో కలిసి హైదరాబాద్‌ జిల్లా పరిధిలో వివిధ శాఖలకు కేటాయించిన 66 మంది వీఆర్‌ఏలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ సేవకులుగా సేవలు అందిస్తున్న వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ ప్రభుత్వ శాఖల్లో వారి విద్యార్హతల ఆధారంగా జూనియర్‌ అసిస్టెంట్‌, హెల్పర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితర కేటగిరీలలో నియమించామని వివరించారు. హైదరాబాద్‌ జిల్లాకు 182 మందిని కేటాయించామని పేర్కొన్నారు. వీరిలో 40 మంది హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వారుకాగా, 26 మంది మెదక్‌, 62 మంది కామారెడ్డి, 17 మంది జనగాం, 37 మంది మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలకు చెందినవారున్నారని తెలిపారు. నూతనంగా నియమితులైన వారికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, ప్రభాకర్‌ రావు, రహ్మత్‌ బేగ్‌, ఎమ్మెల్లేఉ దానంనాగేందర్‌, మాగంటి గోపినాథ్‌, కాలేరు వెంకటేష్‌, కౌసర్‌ మొహినోద్దిన్‌, మౌజం ఖాన్‌, ముంతాజ్‌ఖాన్‌, కలెక్టరేట్‌ ఏఓ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.